టికెట్ గురించి లోకేష్ ను అడగాను.. అందరం కలిసి పనిచేద్ధామన్నారు!!
రాబోయే ఎన్నికల్లో పోటీచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మ వెల్లడించారు. తాను పోటీచేయడానికి ఆసక్తిగా ఉన్నానని, అయితే నిర్ణయం తీసుకోవల్సింది చంద్రబాబేనని స్పష్టం చేశారు. రాజాం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కొండ్రు మురళి, గ్రీష్మ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. పార్టీకి నమ్మకంగా ఉండేవారు, స్థిరంగా ఉండేవారు కావాలా? జంపింగ్ లు కావాలా? అనేది తేల్చుకోవాల్సింది చంద్రబాబేనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యలూ గ్రీష్మ పలు విషయాలను వెల్లడించారు.

లోకేష్ ను అడిగితే కలిసి పనిచేద్దామన్నారు!
తనకు వేరే ఆలోచన లేదని, టికెట్ గురించి లోకేష్ ను అడిగానని, అందరం కలిసి పనిచేద్దామని తనతో చెప్పారన్నారు. తాను కచ్చితంగా ఎమ్మెల్యే అవుతానన్నారు. వచ్చే ఎన్నికలకు పోటీచేయడానికి డబ్బులు కావాలని, తన భర్త బాగానే సంపాదిస్తున్నారని, ఆ విషయంలో తాను అదృష్టవంతురాలినన్నారు. త్యాగాలు చేయడంతోపాటు కేడర్ ను రక్షించుకోవాలంటే మానసికంగా బలంగా ఉండాలన్నారు. ఇవన్నీ ఆలోచించుకొనే రంగంలోకి దిగానన్నారు.

తన తల్లిని ఎన్టీఆర్ సొంత కూతురిలా చూసుకున్నారు..
తన తల్లి ప్రతిభా భారతిని తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ సొంత కూతురిలా చూసుకునేవారని, అందుకే తాము ప్రజాసేవకు బద్ధులయ్యామన్నారు. 2014 ఎన్నికల్లో అన్ని విషయాలు తానే చూసుకున్నానని, కేవలం 500 ఓట్ల తేడాతో ఓడిపోయామన్నారు. అప్పుడే తనకు రాజకీయం అంటే ఏమిటో అర్థమైందన్నారు. మనల్ని మోసం చేసేది ఎదుటివారు కాదని, మనవారే మోసం చేస్తారనే తత్వం ఆ ఎన్నికలతో బోధపడిందన్నారు. రాజాం పార్టీ అధ్యక్షురాలిని చేస్తేనే పనిచేస్తానని చెప్పానని, వెంటనే తనకు ఆ పదవి ఇచ్చారన్నారు.

వేదికపైకి వెళ్లగానే బరస్టయ్యాను..
మహానాడులో తొడకొట్టడంపై గ్రీష్మ ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు. ఆరోజు చాలా విషయాలు మాట్లాడదామని సభకు వచ్చానని, అయితే అప్పటికే మాట్లాడిన నేతలంతా తాను మాట్లాడినవి మాట్లాడేశారన్నారు. వేదికపైకి వెళ్లిన తర్వాత తాను ఒక్కసారిగా బరస్టయ్యానని, మహానాడు తర్వాత తనకు బెదిరింపులు కూడా వచ్చాయన్నారు. ఒక టీవీ డిబేట్ లో వైసీపీ నేత ఒకరు నిన్నెవరైనా రేప్ చేశారా? అని ప్రశ్నించారని, దీనిపై జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశానన్నారు. తాను అలా వ్యవహరించడం చూసి తన తల్లి ప్రతిభా భారతి కూడా ఆశ్చర్యపోయారన్నారు.












Click it and Unblock the Notifications