కవిత సంకేతాలు: బిజెపిపై తెలంగాణ టిడిపి గుర్రు, కటీఫ్?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) దగ్గరవుతున్న సూచనలు అందుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ దూరమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన వ్యాఖ్యలు ఆ విషయాన్ని తెలియజేస్తున్నాయి. టిఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుంటే, తాము బిజెపితో తెగదెంపులు చేసుకుంటామని ఆయన చెప్పారు.
ప్రధాని మోడీ ఆహ్వానిస్తే కేంద్ర మంత్రి వర్గంలో చేరడం గురించి ఆలోచన చేస్తామని కవిత చెప్పారు. దీంతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారిపోయినట్లు కనిపించింది. నిజానికి, మోడీ ప్రభుత్వంలో టిఆర్ఎస్ చేరడానికి సిద్ధంగా ఉందని చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) ఎన్నికల నేపథ్యంలో టిఆర్ఎస్ ఆ సాహసం చేస్తుందా అనేది సందేహమే. బిజెపితో స్నేహం చేస్తే మజ్లీస్ దూరమయ్యే అవకాశం ఉంది. జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎస్‌కు మజ్లీస్ దోస్తీ అత్యంత కీలకమైంది, అవసరమైంది.
స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించడం ద్వారా ప్రజల్లోకి వెళ్లడంతో పాటు ప్రధాని నరేంద్ర మోడీని సంతోషపెట్టే ఎజెండా కూడా ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఉన్నట్లు చెబుతున్నారు. కెసిఆర్, కవిత బిజెపి దగ్గరవుతున్న సంకేతాలను పంపించడం ద్వారా తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో అయోమయం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారా అనేది కూడా ప్రశ్నే. తెలంగాణ తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ప్రధాన ప్రత్యర్థి టిఆర్ఎస్. అందువల్ల బిజెపికి టిఆర్ఎస్ దగ్గరయితే టిడిపి తన స్నేహాన్ని కొనసాగించడం కష్టమే అవుతుంది.

జిహెచ్ఎంసి ఎన్నికల్లో తెలుగుదేశం, బిజెపి కలిసి నడుస్తాయని ఇప్పటి వరకూ అనుకుంటున్నారు. ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బలపరిస్తే టిఆర్ఎస్‌కు కష్టమే అవుతుంది. దానివల్ల కూడా టిడిపి, బిజెపి మధ్య పొరపొచ్చాలు సృష్టించే ప్రయత్నాల ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలనే వ్యూహం కెసిఆర్‌కు ఉందా అనేది ఆలోచించాల్సిన విషయం. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో కెసిఆర్ ఉన్నతాధికారులను, ఉద్యోగులను మాత్రమే కాకుండా గవర్నర్ నరసింహన్‌ను కూడా భాగం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రశంసాత్మకమైన కార్యక్రమంగా కెసిఆర్ పాల్గొన్న సభలోనే ఆ కార్యక్రమాన్ని నరసింహన్ ప్రశంసించారు.
బిజెపి తెలంగాణ టిడిపిని దూరంగా చేసుకుంటుందా అనేది కూడా ఆలోచించాల్సిన విషయమే. టిఆర్ఎస్‌తో బిజెపి స్నేహం చేస్తే తాము కచ్చితంగా తెగదెంపులు చేసుకుంటామని, బిజెపితో కొనసాగడమా లేదా అనేది ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ఇష్టమని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఏమైనా, బిజెపి, టిడిపి మధ్య విభేదాలను తనకు అనుకూలంగా మలుచుకునే పనిలో టిఆర్ఎస్ పడినట్లు కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications