హైదరాబాద్ మాదే: నివేదిక పంపిన కవిత, విన్నపాలు

ఆమె మంత్రుల బృందానికి(జివోఎం) ఓ నివేదిక పంపించారు. ప్రత్యేక రాష్ట్రానికి కావాల్సిన వనరుల వివరాలను ఆ నివేదికలో పొందుపరిచారు. కొత్త ఏర్పడబోతున్న రాష్ట్రం నవజాత శిశువుతో సమానమని, తెలంగాణ ప్రాంతం ఇప్పటికే ఉద్యోగాలు, సాగునీరు, సాంకేతిక విద్య, వైద్య ఆరోగ్య, మౌలిక సదుపాయాల్లో చాలా నష్టపోయిందని, విభజనలో భాగంగా తెలంగాణ ప్రాంతానికి అన్నింటా న్యాయమైన వాటా దక్కాలన్నారు.
హైదరాబాద్‌లోని శాంతి భద్రతలు, స్థానిక పాలనాధికారాలను కేంద్రం తన చేతుల్లోకి తీసుకుంటుందని వార్తలు వెలువడుతున్నాయని కానీ ఇలాంటి చర్యలను విరమించుకోవాలన్నారు. లేకపోతే తెలంగాణలోని ఇతర ప్రాంతాల ప్రజలకు అభద్రతా భావం ఏర్పడే అవకాశం ఉందన్నారు. తెలంగాణ ప్రజల మత, మనోభావాలను పరిరక్షించాలని కోరారు.
తెలంగాణలో ప్రముఖ కట్టడాలు, దేవాలయాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని, దీనిపై పార్లమెంటులో ప్రత్యేక చట్టాన్ని చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు వల్ల ఆదివాసీలకు నష్టం జరగకుండా చూడాలన్నారు. తెలంగాణ ప్రాంతానికి నష్టం కలిగించే దుమ్ముగూడెం-టెయిల్ పాండ్ ప్రాజెక్టును నిలిపివేయాలని, పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాలన్నారు. విమానాశ్రయాలు నిర్మించాలన్నారు.
ప్రతి తెలంగాణ జిల్లాకు ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలతో కూడిన ఒక యూనివర్సిటీని కేటాయించాలని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక డిగ్రీ కాలేజీని మంజూరు చేయాలని, సింగరేణి ఏరియాలో ప్రత్యేకంగా ఒక మెడికల్ కాలేజీ, మైనింగ్ యూనివర్సిటీని, తెలంగాణకు ఒక మహిళా యూనివర్సిటీని కేటాయించాలన్నారు.
మూతబడిన ఐడిపిఎల్, ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ, నిజాం సుగర్స్, అజాంజాహి మిల్స్, డిబిఆర్ మిల్స్ వంటి వాటిని తిరిగి తెరవాలని, హైదరాబాద్‌లో సుప్రీం కోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలని, తెలంగాణ జిల్లాలోని ఎనిమిది లక్షల మంది బీడీ, చేనేత కార్మికులకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో చేపడుతోన్న మెట్రో రైలు ప్రాజెక్టును హెచ్ఎండీఏ పరిధిలోని అన్ని మండలాలకు విస్తరించాలి.












Click it and Unblock the Notifications