రెచ్చగొట్టకండి, తర్వాతే పొత్తు: కెసిఆర్, త్వరలో భారీ సభ

పార్టీ ఎమ్మెల్యేలు, జెఏసి నాయకులతో కెసిఆర్ లోకసభలో బిల్లు ఆమోదం పొంది తర్వాత మాట్లాడారు. తెలంగాణ బిల్లుకు బుధవారం రాజ్యసభలోనూ ఆమోదం లభిస్తుందని ఆయన అన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి అపాయింట్‌మెంట్ డే ఉత్తర్వులు కూడా ఐదు రోజుల్లో వెలువడతాయన్నారు. సోనియాగాంధీ తెలంగాణపై మాటపై నిలబడ్డారని, ప్రజలు కూడా ఆమెకు కృతజ్ఞత చూపించాలని అన్నారు.
ఈ మేరకు రాజ్యసభలో టీ బిల్లు ఆమోదం పొందాకే అందరం కలిసి సోనియా, ప్రధాని, రాష్ట్రపతి, తెలంగాణకు మద్దతు ఇచ్చిన అన్ని రాజకీయ పార్టీలను కలిసి కృతజ్ఞతలు చెబుదామన్నారు. అప్పటి వరకు ఐకాస నేతలంతా ఢిల్లీలోనే ఉండాలన్నారు. పార్టీ ఎమ్మెల్యేలందరూ తిరిగి నియోజకవర్గాలకు గురువారం వెళ్లి విజయోత్సవాలు చేసుకోవాలని సూచించారు. ఎంపీలు, ఇతర ముఖ్య నేతలు ఇక్కడ ఉంటే సరిపోతుందన్నారు.
బిల్లులోని సవరణలపై ప్రజలను గందరగోళపరచొద్దని నేతలకు సూచించారు. ప్రజలు ఆందోళనకు గురయ్యేలా ఎవరూ మాట్లాడవద్దని చెప్పారు. రాష్ట్రం ఏర్పడ్డాక అన్ని విషయాలు చూసుకోవచ్చన్నారు. కాంగ్రెస్‌లో పార్టీ విలీనం లేదా పొత్తుపై తొందరపాటు వద్దని, అన్ని విషయాలు మాట్లాడుకొని సంతృప్తి చెందిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయనకు పలువురు పార్టీ నేతలు సూచించినట్లు సమాచారం.
ఈ నెల 25 తర్వాతే ఢిల్లీ నుంచి తిరిగి హైదరాబాద్‌కు వెళ్దామని ఆయన వారికి చెప్పారు. లక్ష పైచిలుకు మందితో స్వాగత ఏర్పాట్లు చేయాలని పార్టీ నేతలకు నిర్దేశించారు. అలాగే తెరాస ద్వారానే తెలంగాణ సాధ్యమైందనే వాదనను ప్రజల్లో చాలా బలంగా తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. అందుకు మార్చి మొదటి వారంలో హైదరాబాద్‌లో కృతజ్ఞత సభ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిద్దామని చెప్పారు.
అప్పటికి కాంగ్రెస్‌తో వ్యవహారాలన్నీ ఒక కొలిక్కి వస్తే, ఆ పార్టీ అగ్ర నేతలనూ ఈ సభకు ఆహ్వానిద్దామని, అదే వేదికపై నుంచి విలీనం లేదా పొత్తు ప్రకటన చేద్దామని నేతలతో కెసిఆర్ అన్నారు. మరోవైపు రాజ్యసభలో బిల్లుకు మద్దతూ కూడగట్టేందుకు కెసిఆర్ వివిధ జాతీయ పార్టీ నేతలను కోరారు.












Click it and Unblock the Notifications