బ్యాంకర్లపై కేసీఆర్ అసహనం, నచ్చితేనే అనేది నిజం..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బ్యాంకర్ల తీరు పైన అసహనం వ్యక్తం చేశారు. శాసన సభలో ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రుణమాఫీ విషయమై ప్రశ్నించారు. దీనిపై సీఎం మాట్లాడారు. స్వయం ఉపాధి కింద వెనుకబడిన వర్గాలకు రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకర్ల తీరు బాగోలేదని కేసీఆర్ అన్నారు.
రుణాల విషయంలో నిరుద్యోగ యువతకు సరైన న్యాయం జరగని మాట వాస్తవమేనని చెప్పారు. బ్యాంకర్ల ప్రత్యక్ష ప్రమేయం వల్ల వాళ్లకు నచ్చితేనే రుణాలు ఇస్తున్నారన్నది కూడా వాస్తవమే అన్నారు. ఏళ్ల తరబడి పెండింగులో ఉండకుండా ఏం చేయాలనే దాని పైన అందరి సహకారం తీసుకుంటామన్నారు.
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పైన మాట్లాడుతూ.. దీనిని పకడ్బందీగా అమలు చేద్దామన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పైన నాలుగైదు రోజుల్లో సమీక్షించి నిర్ణయాలు తీసుకుందామని చెప్పారు. సమావేశాలు జరుగుతుండగా ఫ్లోర్ లీడర్లతో సమావేశమై చర్చిస్తామని తెలిపారు.

దళితుల సమస్యలు ఎక్కడివి అక్కడే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకులు ఏదో కథలు చెప్పి లబ్ధిదారులకు రుణాలు ఎగగొడుతున్నాయన్నారు. ఈ విషయమై బ్యాంకర్లతో చాలాసార్లు మాట్లాడామని, బ్యాంకుల ప్రమేయం లేకుండానే రూ.కోటి అందజేసే ప్రణాళిక రూపొందిద్దామని చెప్పారు.
కాగా, తెలంగాణ శాసనసభ సమావేశాలు నాలుగో రోజు పలు పార్టీలు వాయిదా తీర్మానాలను ఇచ్చాయి. పెన్షన్లు, ఆహారభద్రతపై టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి బీజేపీ, గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలంటూ సీపీఐ, సీపీఎంలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది.
ఇదిలా ఉండగా, తెలంగాణ శాసనసభ 10 నిమిషాలు వాయిదా పడింది. ప్రశ్నోత్తరాల సందర్భంగా అధికార, విపక్ష సభ్యుల మధ్య వాడీవేడిగా చర్చ కొనసాగింది. చర్చ మధ్యలో సభ్యులు ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగారు. దీంతో, స్పీకర్ మధుసూదనాచారి 10 నిమిషాల పాటు టీ బ్రేక్ ప్రకటించారు.












Click it and Unblock the Notifications