'ముంబై'పై కెసిఆర్ దృష్టి, టిలోను టిడిపికి 'సైకిల్' గుర్తే
హైదరాబాద్: ముంబై రవాణా వ్యవస్థను అధ్యయనం చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎల్ఈడీ స్కీన్లను ఏర్పాటు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. సాయంత్రం కెసిఆర్ ట్రాఫిక్ పైన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన.. నియంత్రణ పైన ప్రణాళికలు అందచేయాలని సూచించారు. ప్రజా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాలన్నారు. బస్టాపులను ఆధునికీకరించాలన్నారు. హైదరాబాదులో ట్రాఫిక్ నియంత్రణకు ప్రణాళికలు సిద్ధం చేసివ్వాలని ఆయన సూచించారు.

గురుకుల ట్రస్ట్ భూఆక్రమణలపై ఆగ్రహం
గురుకుల ట్రస్ట్ భూముల కబ్జాపై ముఖ్యమంత్రి కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూముల ఆక్రమణలను వెంటనే తొలగించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. జీహెచ్ఎంసీ అధికారులతో భేటీ అయిన కెసిఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఏపీఎస్పీ బెటాలియన్ సహకారంతో అక్రమ కట్టడాలను తొలగించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
కేంద్రమంత్రికి కెసిఆర్ విజ్ఞప్తి
కేంద్రమంత్రి రాధామోహన్ సింగ్ సోమవారం సాయంత్రం కెసిఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో వ్యవసాయ, వెటర్నీటీ విశ్వవిద్యాలయాలను నెలకొల్పాలని, పౌల్ట్రీ, డెయిరీ రంగాన్ని ప్రోత్సహించాలని కెసిఆర్ ఆయనను కోరారు.
పారాదీప్ నుండి పైప్ లైన్లు: ఈటెల
పౌరసరఫరాల అధికారులతో మంత్రి ఈటెల రాజేందర్ సోమవారం సమావేశమయ్యారు. ఉత్తర తెలంగాణలో పెట్రోల్ కొరత ఉందని, హెచ్‌పీసీఎల్, ఐవోసీ, బీపీఎల్ సమన్వయంతో పని చేయాలని అధికారులకు మంత్రి సూచించారని సమాచారం. అలాగే రామగుండం ఐవోసీ కంపెనీ రెండు షిప్టుల్లో పనిచేయాలని మంత్రి ఈటెల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఒడిశా పారాదీప్ నుండి లైన్లు వేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు.
రెండు రాష్ట్రాల్లో సైకిల్ గుర్తు
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న, తెలంగాణలో పదిహేను స్థానాలను గెలుచుకున్న తెలుగుదేశం పార్టీకి.. రెండు రాష్ట్రాల్లోను సైకిల్ గుర్తును కొనసాగిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications