మీడియా వద్ద నోరు జారొద్దు: మంత్రులకు కెసిఆర్
హైదరాబాద్: మీడియా ముందు నోరు జారవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తన మంత్రివర్గ సహచరులను ఆదేశించారు. కీలకమైన ప్రభుత్వ విధానాలపై ఆచితూచి స్పందించాలని నిర్దేశించారు. రాష్ట్ర మంత్రివర్గ తొలి సమావేశం సోమవారం రాత్రి ఇక్కడ సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగింది. విద్యాశాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి మినహా డిప్యూటీ సీఎంలు మహమూద్అలీ, డాక్టర్ టి.రాజయ్యతోపాటు మిగిలిన 9 మంది మంత్రులు ఈ భేటీలో పాల్గొన్నారు.
ఈనెల 6న సాయంత్రం ఢిల్లీకి వెళ్లిన కెసిఆర్, ఆదివారం సాయంత్రం 6.50 గంటలకు శంషాబాద్‌కు చేరుకుని, రాత్రి 7.45 గంటలకు నేరుగా సచివాలయానికి వచ్చారు. కెసిఆర్‌ను ఎన్నికల కమిషన్ తెలంగాణ రాష్ట్ర ప్రధానాధికారి (ఇన్‌చార్జి) భన్వర్‌లాల్ కలిశారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఖాళీల భర్తీ చేపట్టాలంటే మొదట కేబినెట్ అనుమతి కావాల్సి ఉందని ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. కెసిఆర్ సచివాలయం చేరుకోవటానికి ముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను కూడా కలిసి ఇదే విషయాన్ని తెలియజేశారు.

సరిగ్గా రాత్రి 8 గంటలకు ప్రారంభమైన తెలంగాణ మంత్రివర్గ సమావేశం 9.45 గంటలకు ముగిసింది. ఈ సందర్భంగా తొలుత శాసనసభ, మండలి సభ్యులనుద్దేశించి రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఈ నెల 11న చేయబోయే ప్రసంగానికి తాత్కాలిక ఆమోదం తెలిపారు. తర్వాత ఆంగ్లో-ఇండియన్ ఎమ్మెల్యే, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఖాళీల పచ్చజెండా ఊపారు. రెండు రోజుల తన ఢిల్లీ పర్యటన విశేషాలను మంత్రులకు కేసీఆర్ వివరించారు. తమ విజ్ఞప్తులపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సానుకూల స్పందన వ్యక్తంచేశారని తెలిపారు. తదుపరి రైతులకు రూ.లక్ష వరకు రుణ మాఫీ అంశం ప్రస్తావనకు వచ్చింది.
రుణమాఫీ విధివిధానాలు ఇంకా ఖరారు కానప్పటికీ, ఒక మంత్రి చేసిన ప్రకటన నేపథ్యంలో ఈ వ్యవహారం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని కేసీఆర్ ప్రస్తావిస్తూ - ప్రభుత్వానికి సంబంధించి విధివిధానాలను, కీలకమైన నిర్ణయాలను ప్రకటించేటప్పుడు తొందరపాటు తగదని మంత్రివర్గ సహచరులకు సూచించారు. నోరు జారటం వల్లనే తాము అధికారం చేపట్టి వారం కాకముందే రైతుల ఆందోళనలు, ఆత్మహత్యలు, విపక్షాల విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. అధికారులతో చర్చించి తుది నిర్ణయం తీసుకున్న తర్వాతే మీడియా ముందు వెల్లడించాలని నిర్దేశించారు. ప్రతి శాఖకు సంబంధించి ఇదే సూత్రాన్ని పాటించాలని చెప్పారు.
మీడియాతో జాగ్రత్తగా ఉండాలని కెసిఆర్ మంత్రులకు సూచించారు. దీంతో సమావేశం ముగిసిన తర్వాత మంత్రులందరూ మీడియాకు ముఖం చాటేశారు. కనీసం హిమాచల్‌ప్రదేశ్‌లో విద్యార్థుల గల్లంతు ఘటనపైనా స్పందించలేదు. భేటీ ముగిశాక కార్లలో ఎక్కి సచివాలయాన్ని వీడుతున్న మంత్రుల వద్దకు పలువురు మీడియా ప్రతినిధులు ప్రమాద ఘటన గురించి తెలియజేస్తే, సచివాలయంలోని సమాచార, పౌర సంబంధాల శాఖ పబ్లిసిటీ సెల్ నుంచి నోట్ వస్తుందంటూ వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications