తెలంగాణకి కెసిఆర్ అన్యాయం: పవన్ కళ్యాణ్‌కు సోమిరెడ్డి అండ, ఫిర్యాదుకు ఢిల్లీలో బాబు
హైదరాబాద్: ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్‌లో మార్పు చేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావే తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని, ఆంధ్రావాళ్లు తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆయన అనడం సరికాదని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురువారం అన్నారు.
ముఖ్యమంత్రిగా ఉన్న కెసిఆర్ తన మాట తీరును మార్చుకోవాలని హితవు పలికారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేకుండా చేయడం ఎవరి వల్ల కాదన్నారు. అది అసాధ్యమని చెప్పారు. రెండు రాష్ట్రాల్లోను తెలుగుదేశం పార్టీ ఉంటుందని చెప్పారు.
జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలు సరికాదని సోమిరెడ్డి చెప్పారు.

రేపు ఢిల్లీలో పర్యటించనున్న ఏపీ సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం ఢిల్లీలో పర్యటించనున్నారు. పలువురు కేంద్రమంత్రులతో భేటీ అవుతారు. ఫోన్ ట్యాపింగ్, సెక్షన్-8 అంశాలపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో చర్చించనున్నారు.
అంతర్రాష్ట జల వివాదాలపై కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతితో చర్చించనున్నారు. కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, ప్రకాశ్ జవదేకర్‌తో చంద్రబాబు భేటీ కానున్నారు. జపాన్ పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకుని ఆయన తన బృందంతో గురువారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు.
జపాన్ పర్యటన విజయవంతం
చంద్రబాబు జపాన్ పర్యటన విజయవంతమైందని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం చెప్పారు. పెట్టుబడులకు ఏపీలో ఉన్న అవకాశాలను జపాన్ పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు వివరించారని చెప్పారు. నూతన రాజధాని నిర్మాణానికి అక్టోబర్లో శంకుస్థాపన ఉంటుందని, జపాన్ ప్రధానిని ఆహ్వానించామన్నారు.












Click it and Unblock the Notifications