హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫాసిస్టు చర్య: మోడీని ఏకేసిన కెసిఆర్, ఎదురులేఖ

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఉమ్మడి రాజధాని హైదరాబాద్ శాంతిభద్రతలపై అధికారాలను గవర్నర్‌కు అప్పగిస్తూ నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో మండిపడింది. కేంద్రం లేఖపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తిరుగుటపాలో లేఖ రాసింది. హైదరాబాద్ శాంతిభద్రతలను గవర్నర్‌కు అప్పగించే ప్రతిపాదనను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.

కేంద్ర హోం శాఖ నుంచి లేఖ అందిన వెంటనే తెలంగాణ సీఎస్‌ రాజీవ్‌ శర్మ కూడా వేగంగా స్పందించారు. ఈ ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టానికి, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమంటూ వెన్వెంటనే శుక్రవారం సాయంత్రమే కేంద్ర హోం శాఖకు తిరుగు లేఖ రాశారు.

K Chandrasekhar Rao

ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన తెలంగాణ ప్రభుత్వానికి చెందిన అధికారాలను కబళించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫాసిస్టు చర్యలకు పాల్పడుతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మండిపడ్డారు. రాజ్యాంగం ప్రకారం శాంతిభద్రతలు రాష్ట్ర పరిధిలోని అంశమని, వాటిని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని, రాష్ట్రాల అధికారాలను కబ్జా చేయడమని కెసిఆర్ అన్నారు.

కేంద్రం నుంచి లేఖ వచ్చిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే హుటాహుటిన ఆయన ఉన్నతాధికారులను పిలిపించుకున్నారు. లేఖలోని అంశాలపై సమగ్ర సమాచారం తెప్పించుకున్న మీదట కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చాలని నిర్ణయించారు. అప్పటికప్పుడు పలువురు ముఖ్యమంత్రులతో కూడా ఫోన్లో మాట్లాడి కేంద్రంతో పోరాటానికి సహకరించాలని కోరారు.

కేంద్రం పంపిన లేఖ అప్రజాస్వామికంగా, రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ఉందని కెసిఆర్ అన్నారు. దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ కేంద్రానికి లేఖ రాయాలని సీఎస్‌ రాజీవ్‌ శర్మకు ఆదేశాలు జారీచేశారు. కేంద్ర ప్రభుత్వ లేఖలోని అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేక అంశాలను పట్టించుకోబోమని, వాటిని అమలు చేయబోమని కెసిఆర్ స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను హరిస్తూ కేంద్ర పంపిన లేఖను దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పంపాలని ఆదేశించారు. త్వరలోనే ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వ ఫాసిస్టు ధోరణిని ప్రతిఘటించడానికి ఉద్యమానికి శ్రీకారం చుడతామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు.

English summary
Telangana CM K Chandrasekhar Rao has lashed out at PM Narendra Modi's union governement on law and order of Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X