గవర్నర్‌తో కెసిఆర్: మంత్రివర్గ విస్తరణ, హైకోర్టుపైనా?
హైదరాబాద్: రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు గురువారం భేటీ అయ్యారు. వీరి భేటీ రెండు గంటల పాటు కొనసాగింది. గవర్నర్‌ను ముఖ్యమంత్రి కలవడంతో మంత్రివర్గ విస్తరణ కోసమేనంటూ ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈనెల 22న మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు.
దీపావళి పండుగ తరువాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. మంత్రివర్గంలో మహిళలకు, ఎస్‌టికి వర్గానికి ప్రాతినిధ్యం లేదు. మహిళా మంత్రి, ఎస్‌టి మంత్రి లేకుండా బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం సరికాదనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి సమావేశాల కన్నా ముందే మంత్రివర్గాన్ని విస్తరించాలనే ఆలోచనలో ఉన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు.
మంత్రి పదవి హామీతోనే టిడిపి నుంచి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరారు. తుమ్మల పార్టీలో చేరిన సమావేశంలోనే జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు నాయకత్వంలో పార్టీ నాయకులు పని చేయాలని కెసిఆర్ సూచించారు. ఇక మహబూబ్‌నగర్ జిల్లా నుంచి మంత్రి పదవి ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డిలు ఒకవైపు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు తెలంగాణ ఉద్యమ సమయంలో మంత్రి పదవికి రాజీనామా చేసి టిఆర్‌ఎస్‌లో చేరిన జూపల్లి కృష్ణారావు మంత్రి పదవిని ఆశిస్తున్నారు.

కొప్పుల ఈశ్వర్‌కు మంత్రి పదవి లభించే అవకాశం ఉంది. ఎస్‌టి కోటా, మహిళా కోటా కింద ఒకరికే మంత్రి పదవి లభించే అవకాశం ఉందని పార్టీలో ప్రచారం సాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నగరానికి చెందిన టిడిపి ఎమ్మెల్యేలను టిఆర్‌ఎస్‌లో చేర్చుకోవడంపై పార్టీ నాయకత్వం దృష్టిసారించింది. విస్తరణలో హైదరాబాద్‌కు అవకాశం ఉండవచ్చుననే ఊహాగానాలు సాగుతున్నాయి.
హైకోర్టుపై, ఇతర సంస్థలపై...
ఇటీవల తాను ఢిల్లీకి వెళ్లి వచ్చిన విశేషాలను ముఖ్యమంత్రి గవర్నర్‌కు వివరించినట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ప్రత్యేకంగా ఏర్పాటు చేయటానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుముఖంగా ఉన్నారని, ఈ మేరకు అందుబాటులో ఉన్న భవనాల పరిశీలన కూడా పూర్తిచేశామని ఆయనకు చెప్పినట్లు సమాచారం. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను డిసెంబర్ రెండో తేదీలోగా ఆమోదించుకోవాల్సిన క్రమంలో తొందరలోనే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించటానికి కసరత్తు జరుగుతోందని చెప్పినట్లు తెలిసింది.
అఖిల భారత సర్వీసు అధికారుల కేటాయింపును కేంద్రం త్వరితగతిన పూర్తి చేయకపోవటంతో అధికారులు లేక పాలనలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారని సమాచారం. వివిధ కార్పొరేషన్లు, సంస్థల విభజన, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను సీఎం కోరినట్లు తెలిసింది.
వాటర్‌గ్రిడ్ సహా వివిధ ప్రభుత్వ కార్యక్రమాలను ఆయనకు వివరించినట్లు సమాచారం. హైరదాబాద్‌లో ఇకపై హుస్సేన్‌సాగర్‌లో గణేష్ నిమజ్జనోత్సవం నిర్వహించకుండా నిలిపివేసి, నిమజ్జనానికి ఇందిరాపార్క్‌లో ప్రత్యేకంగా సరస్సును నిర్మించే ఆలోచనను ఆయనతో పంచుకున్నట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications