కూచోబెట్టాల్సిందే: పోలవరంపై కెసిఆర్ కిరికిరి
న్యూఢిల్లీ: పోలవరం గురించి తాను ప్రధాని మోదీతో దాదాపు 7-8 నిమిషాలు మాట్లాడానని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ తర్వాత హైదరాబాదు బయలుదేరే ముందు ఆయన ఆదివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.
ఎవరో తప్పుడు మార్గం చెప్పి తొందర పెట్టారని, తీసుకున్నది చాలా హడావుడి నిర్ణయం, అది సరిగా లేదని, అందుకే తాము ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించామని తాను చెప్పానన్నారు. తెలంగాణ రాష్ట్రానికి తాను ప్రాతినిధ్యం వహిస్తున్నందున తన డ్యూటీ తాను చేయాలని, అది తప్పకుండా చేస్తానని చెప్పానని తెలిపారు. గోదావరి నుంచి ఆంధ్రా ప్రాంతం నీరు తీసుకునేందుకు తాను వ్యతిరేకం కాదని, అయితే ఇందుకు ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయని చెప్పారు.

అలాంటప్పుడు అనవసరంగా నాలుగు రాష్ట్రాల్లోని 15 లక్షల మంది గిరిజనుల్ని ఎందుకు ముంపుకు గురిచేయాలి? అని కేసీఆర్ ప్రశ్నించారు. ఆంధ్రా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిసా రాష్ట్రాలకు చెందిన సమస్య ఇదని, ఇప్పటికే ఒడిసా సీఎం నవీన్ పట్నాయర్ పోలవరంపై తొందరపడొద్దని ప్రధానికి చెప్పారన్నారు. నాలుగు రాష్ట్రాల్లోనూ మునిగిపోయేది గిరిజనులేనని ఆయన అన్నారు.
ముంపు లక్ష్యం గిరిజనులే కాబట్టి, ముంపు సమంజసం కాదని, నలుగురు ముఖ్యమంత్రులనూ పిలవాలని, కూర్చోబెట్టాలని, సంధానకర్తగా వ్యవహరించి ఏకాభిప్రాయం సాధించి పోలవరంపై ముందుకెళ్లాలని సూచించానన్నారు. అంతే తప్ప తొందరపాటు పనికిరాదని ప్రధానికి వివరించినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications