వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గవర్నర్‌కు టీకి అధికారాలు అవమానమే: కెసిఆర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన సంపూర్ణ తెలంగాణ ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదించినందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్‌లకు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఆ పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రం రావడం అమరవీరుల త్యాగఫలమేనని కెసిఆర్ అన్నారు. ఈ విజయం ఏ ఒక్కరిది కాదని, అమరవీరుల త్యాగాలను మరిచిపోలెమని చెప్పారు. ఏం చేసినా వారి ప్రాణాలను తీసుకురాలేమని అన్నారు.

K Chandrasekhar Rao
2001 నుంచి నవంబర్ 5, 2013 తెలంగాణ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం పొందే వరకూ తెలంగాణ ప్రజలందరూ ఒక్కటై పోరాడారని అన్నారు. తాను 2001లోనే తనకు సహకరించాలని, తెలంగాణ తెచ్చి పెడతానని ప్రజలకు చెప్పానని తెలిపారు. ప్రజలు తనను విశ్వసించి ఉద్యమం చేపట్టారు కాబట్టే ఇప్పుడు తెలంగాణ కల సాకారమవుతోందని చెప్పారు.

సంపూర్ణ తెలంగాణ వస్తే అందరికంటే ముందు తనే ఎక్కువగా సంతోషిస్తానని చెప్పారు. ఉద్యమ నాయకత్వం ఎప్పుడూ విశ్రాంతి తీసుకోకూడదని, ఇప్పుడే సంబరాలు జరపొద్దని అన్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ జరుపుకోని విధంగా సంబరాలు జరుపుకుందామని ఆయన చెప్పారు. ఎక్సైజ్, నీటి పారుదల శాఖలకు సంబంధించిన విషయాలను పరిశీలించేందుకు నిపుణులను, పొలిట్ బ్యూరో సభ్యులను నియమించామని చెప్పారు.

రెండు మూడు రోజుల్లో ప్రధానికి లేఖ రాస్తానని కెసిఆర్ తెలిపారు. తమ అభ్యంతరాలను ఆ లేఖలో తెలియజేస్తామని చెప్పారు. 29వ రాష్ట్రంగా ఏర్పడబోయే తెలంగాణకు మిగితా రాష్ట్రాల మాదిరిగానే అధికారాలు, కేంద్రంతో సంబంధాలు ఉండాలని ఆయన అన్నారు. గవర్నర్‌కు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక అధికారాలు ఇవ్వడమంటే తెలంగాణ ప్రజలను అవమానించడమేనని ఆయన అన్నారు. అందుకు తాము ఒప్పుకోమని, ఈ విషయాన్ని కూడా ప్రధానికి లేఖలో వివరిస్తామని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర అధికారాలను తగ్గించవద్దని ప్రధానిని డిమాండ్ చేస్తామని అన్నారు. 1969 నుంచి తెలంగాణలో అక్రమంగా ఉద్యోగాలు పొందిన సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రిటైరైన సుమారు 84వేల మంది సీమాంధ్ర ఉద్యోగులకు పింఛను కూడా తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందని, అయితే అది సరైన పద్ధతి కాదని అన్నారు. 1969లో 24వేల మంది ఉద్యోగులను, ఎన్టీఆర్ ప్రభుత్వంలో సుమారు 50వేల మంది ఉద్యోగులను సీమాంధ్ర ప్రాంతానికి పంపించారని తెలిపారు.

సీమాంధ్రా ప్రాంతానికి కావాల్సిన విద్యా కేంద్రాలను, ఇతర సదుపాయాలను కల్పిస్తే తమకు అభ్యంతరం లేదని, అయితే తెలంగాణలోని కేంద్రాల్లో తమకు వాటా కావాలంటే మాత్రం ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పారు. అప్పుల పంపిణీలో కూడా జనాభా ప్రాతిపదికన కాకుండా, ఏ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రానికి అప్పులను వర్తింప చేయాలని అన్నారు.

ఢిల్లీలోని ఏపి భవన్ తెలంగాణకే చెందుతుందని అన్నారు. అది నిజాం కాలం నుంచి తమ రాష్ట్రం ఆధీనంలో ఉందని చెప్పారు. సీమాంధ్ర ప్రాంతానికి వెంటనే హైకోర్టు ఏర్పాటు చేయాలని అన్నారు. నదీ జలాల విషయంలోనూ తమకు అభ్యంతరాలున్నాయని, వాటిని నిపుణులతో చర్చించిన తర్వాత ప్రధాని దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. రాజ్యసభ సీట్లను తెలంగాణ ప్రాంతంలో పెంచాలని అన్నారు. తమకు దక్కాల్సిన అన్ని వచ్చిన తర్వాతనే సంబరాలు జరుపుకుంటామని చెప్పారు.

తెలంగాణ ఏర్పాటుకు ప్రత్యేక చొరవ చూపిన సోనియా గాంధీకి, భారతీయ జనతా పార్టీ, ఇతర పార్టీలకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత పార్టీ విలీనంపై ఆలోచిస్తామని అన్నారు. తెలంగాణ ప్రక్రియ ఆగదని తెలిసి కూడా సీమాంధ్ర నేతలు ఇంకా ఆ ప్రాంత ప్రజలను మోసం చేస్తున్నారని, ప్రజలకు ఏం కావాలో, ప్యాకేజీ విషయాలను కేంద్రాన్ని అడగాలని వారికి సూచించారు.

పదేళ్ల ఉమ్మడి రాజధానికి ఒప్పుకున్నాం కానీ, లాండ్ ఆర్డర్ గవర్నర్ చేతిలో ఉండడాన్ని ఒప్పుకోలేదని, అది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ఆంధ్రా ప్రాంతం వారు రాజధానిని నిర్మించుకోవాలనే ఉద్దేశంతోనే పదేళ్ల రాజధానికి ఒప్పుకున్నామని తెలిపారు. ఇక్కడ సీమాంధ్ర ప్రజలు తెలంగాణ ప్రజలతో కలిసి గౌరవంగా జీవించవచ్చని అన్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ ప్రజలు ఉంటున్న విధంగానే తెలంగాణలో సీమాంధ్ర ప్రజలు ఉండవచ్చని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగబోదని, శుక్రవారం రాత్రి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వద్దకు తెలంగాణ బిల్లు వెళుతుందని చెప్పారు. రెండు రోజుల్లో రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే అవకాశముందన్నారు. దేశంలో 17 రాష్ట్రాలు తెలంగాణ కంటే చిన్నవని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత వరంగల్‌లో 25లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో తెలంగాణ రాష్ట్ర సమితిదే కీలక పాత్ర ఉంటుందని కెసిఆర్ అన్నారు.

English summary
Telangana Rastra Samithi (TRS) president K Chandrasekhar Rao has opposed the powers to Governor on Hyderabad in the bifurcation of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X