కేంద్ర వాటా కొనేద్దాం: సింగరేణిపై కన్నేసిన కెసిఆర్
హైదరాబాద్: సింగరేని సంస్థను పూర్తిగా సొంతం చేసుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా సంస్థలో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న 49 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘వాటాల ఉపసంహరణ విధానం'ను లోతుగా అధ్యయనం చేసి, సింగరేణిలో ఉన్న కేంద్ర ప్రభుత్వ వాటాను కొనుగోలు చేసే అవకాశాలను పరిశీలించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
సోమవారం ఈ విషయమై అధికారులతో సుదీర్ఘ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుతం సింగరేణి కాలరీస్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి 51 శాతం, కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉంది. సింగరేణి వాణిజ్య కార్యకలాపాలను రాష్ర్టానికి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి పర్యవేక్షిస్తుంటారు. అయితే, సింగరేణి బొగ్గు కేటాయింపులను మాత్రం కేంద్ర ప్రభుత్వమే చేస్తుంది. కేంద్రం చేసిన కేటాయింపుల ప్రకారం ఆయా సంస్థలకు సింగరేణి సంస్థ బొగ్గును సరఫరా చేస్తుంది.
ప్రస్తుతం రూ.12,300 కోట్ల వార్షిక టర్నోవర్ ఉన్న సింగరేణి కాలరీస్‌ను పెట్టుబడుల ఉపసంహరణను తమకు అనుకూలంగా మార్చుకుని పూర్తిగా హస్తగతం చేసుకుంటే, సింగరేణి బొగ్గు వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వానికే పూర్తి అజమాయిషీ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ వాటాను కొనుగోలు చేయడానికి ఎన్ని నిధులు అవసరమవుతాయో అధ్యయనం చేసి తనకు నివేదిక ఇవ్వాలని సింగరేణి, రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

తెలంగాణలో విద్యుత్తు లోటును అధిగమించేందుకు కొత్త విద్యుత్తు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాల్సిన దృష్ట్యా సింగరేణి సంస్థ కార్యకలాపాలను మరింత విస్తరించి అంతర్జాయతీయస్థాయికి తీసుకెళ్లాలని కెసిఆర్ అధికారులకు సూచించారు. బొగ్గు వెలికితీత, సరఫరాలో అత్యాధునిక నైపుణ్యాన్ని సంతరించుకుని అంతర్జాతీయంగా అతి పెద్ద బొగ్గు సరఫరా సంస్థగా రూపాంతరం చెందాలని ఆకాంక్షించారు.
పెరుగుతున్న బొగ్గు వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని ఆస్ర్టేలియా, ఇండోనేషియా, మొజాంబిక్‌లాంటి దేశాల్లో బొగ్గు బ్లాకులు కొనుగోలు చేసి అక్కడి బొగ్గును రాష్ట్రానికి దిగుమతి చేసుకునేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని, ఇందుకుగాను సింగరేణి సీఎండీ, సీఎం ముఖ్య కార్యదర్శి, మైనింగ్ అధికారులు, కార్మిక నేతలతో కూడిన పది మంది సభ్యుల బృందం ఆయా దేశాలను పర్యటించి, సింగరేణి వాణిజ్య కార్యకలాపాల విస్తరణపై అధ్యయనం చేసి తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

సింగరేణి సంస్థను గత ప్రభుత్వాలు ఆదాయ వనరుగానే చూశాయని, దీంతో 1.19 లక్షలు ఉన్న కార్మికుల సంఖ్య 60వేలకు పడిపోయిందని ముఖ్యమంత్రి అన్నారు. భూగర్భ బావుల్లో బొగ్గు తవ్వకం పనులకు కార్మికులు సిద్ధంగా ఉన్నప్పుడు వారి సంఖ్యను తగ్గించుకోవాల్సిన అవసరమేముందని సింగరేణి అధికారులను ఆయన ప్రశ్నించారు. దసరాకు ముందు ఒకటి లేదా రెండు కొత్త భూగర్భ బావులను తాను ప్రారంభిస్తానని అధికారులకు చెప్పారు. ఈ సంవత్సరంలోనే మరో ఆరు బావుల్లో బొగ్గు తవ్వకం పనులను ప్రారంభించడం ద్వారా వీలైనంతగా ఉపాధి అవకాశాలను పెంచాలని ఆదేశించారు.
ఉద్యోగుల ఆరోగ్యభద్రతకు ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించాలని సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం తర్వాత ఆ వసతులను ఉపయోగించుకుని సింగరేణి సంస్థ ఒక మెడికల్ కాలేజీని కూడా ఏర్పాటు చేయవచ్చని కెసిఆర్ చెప్పారు.












Click it and Unblock the Notifications