APలో అసదుద్దీన్ ఒవైసీ కేంద్రంగా KCR రాజకీయం?
తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని ఉవ్విళ్లూరుతున్నారు. దేశవ్యాప్తంగా పార్టీని బలపరచడమే ఆయన ప్రథమ లక్ష్యం. ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయడంకన్నా ప్రస్తుతానికి లోక్ సభ ఎన్నికలవరకే పరిమితమైన ఎలా ఉంటుందనేది పార్టీలో చర్చ నడుస్తోంది.

కేసీఆర్ కు ఆహ్వానం పలికిన పార్టీలు
కేసీఆర్ కు కర్ణాటక జేడీయూతోపాటు రైతుసంఘాలు, పలు స్వచ్ఛంద సంస్థలు మద్దతు పలుకుతున్నాయి. పాతబస్తీలోని ఎంఐఎంతోపాటు కుమారస్వామి జేడీఎస్, సీపీఎం, సీపీఐతోపాటు ఉత్తర భారతదేశంలో మద్దతు పలికేపార్టీలెన్ని? అనే విషయంలో కొన్నాళ్లకు కానీ స్పష్టత వచ్చే అవకాశం కనపడటంలేదు. అయితే బీజేపీకి వ్యతిరేకంగా ఉండే పార్టీలన్నీ జాతీయ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న కేసీఆర్ కు ఇప్పటికే ఆహ్వానం పలికాయి.

కర్ణాటకలో ఏ నిర్ణయం తీసుకుంటారో?
కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో తెలుగువారు నివసిస్తున్నారు. వీరున్న చోట పోటీచేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అయితే వీరిలో ఎక్కువ మంది ఆంధ్ర ప్రాంతానికి చెందినవారే ఉంటారు. మరి ఇక్కడ కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి. అసద్దుదీన్ తో కలిసి జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఎంఐఎం ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో పాల్గొంటోంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీల్చడానికి బీజేపీ బీటీమ్ గా పోటీచేస్తుంటుందని మమతా బెనర్జీ నిప్పులు చెరిగేవారు.

ఒవైసీపై నిప్పులు చెరుగుతున్న దీదీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసదుద్దీన్ పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. బీజేపీ అభ్యర్థులు నిలబడిన సీట్లలో మైనారిటీ ఓట్లను చీల్చి ఆ పార్టీకి లబ్ధిచేకూర్చడానికే ఒవైసీ తన అభ్యర్థులను నిలబెడుతుంటారని ధ్వజమెత్తుతున్నారు. పోటీచేసిన అన్ని సీట్లలో ఎంఐఎం అతి తక్కువ సంఖ్యలోనే సీట్లను గెలుచుకోగలుగుతుంది అనేకన్నా వేళ్లమీద లెక్కపెట్ట కలిగిన సీట్లనే గెలుచుకోగలుగుతోంది. గెలుపోటములకన్నా ఓట్ల చీలికపైనే ఆ పార్టీ దృష్టిపెడుతుండటంతో భారతీయ జనతాపార్టీకి లబ్ధి చేకూరుతోంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ మిత్రుడొస్తున్నారు.. మైనారిటీ ఓట్లు చీల్చడానికి అంటూ మమతాబెనర్జీ చేసిన ప్రచారం బాగా కలిసొచ్చింది. మైనారిటీలంతా దీదీకే పట్టం కట్టారు.

జగన్ కు సన్నిహితుడే!
వాస్తవానికి ఏపీలో పోటీకి అసదుద్దీన్ దూరంగా ఉంటూ వస్తున్నారు. అధికారంలో ఉన్న జగన్ తో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. మైనారిటీలంతా అసదుద్దీన్ కు మద్దతు పలికితే జగన్ నష్టం చేకూరుతుంది. ముస్లిం, ఎస్సీ, ఎస్టీ ఓట్లు సాధించడానికి అసదుద్దీన్ తో కలిసి కేసీఆర్ భారత రాష్ట్ర సమితి తరఫున రాజకీయం చేయడానికి తాజాగా కేసీఆర్ సిద్ధమవుతున్నారు. అయితే ఈ వర్గాలన్నీ ఏపీలో జగన్ కు మద్దతు తెలియజేస్తున్నారు. కేసీఆర్ కు, అసదుద్దీన్ కు జగన్ సన్నిహితుడే కావడంతో వీరి రాజకీయం ఎలా ఉండబోతుందా? అనే ఉత్కంఠపై మున్ముందు ఒక స్పష్టత రాబోతోంది. అప్పటివరకు వేచిచూడటమే.












Click it and Unblock the Notifications