తొలి సిఎంపై చెప్తా, రాజకీయాల్లో మా కుటుంబం: కెసిఆర్

 KCR press meet
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఎవరో తాను త్వరలో చెబుతానని, తన కుటుంబం రాజకీయాల్లో ఉంటే తప్పేమిటని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం అన్నారు. అభ్యర్థుల జాబితా ఉగాది తర్వాత ఉంటుందని, టిడిపికి తెలంగాణలో స్థానం లేదన్నారు. అమరుల కుటుంబాలన్నింటికి టిక్కెట్లు ఇవ్వాలంటే ఎలా సాధ్యమన్నారు. రాజకీయ అవసరాల కోసమే తన కుటుంబం రాజకీయాల్లో ఉంటుందన్నారు.

కాంగ్రెసు పార్టీతో పొత్తు ముగిసిన అధ్యాయమని, తెరాసకు అధికారం దక్కితేనే తెలంగాణ ఫలాలు అన్నారు. నరేంద్ర మోడీని చూసి ఓటేయవద్దని చెప్పారు. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి దళితుడే అని తాము ప్రకటించినప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవని కెసిఆర్ పేర్కొన్నారు. మున్ముందు చాలా ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని, పోరాటం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనతో తనకు వెయ్యి జన్మలకు సరిపడా కీర్తి లభించిందని తెలిపారు.

తన కుటుంబ సభ్యులు తప్పనిసరిగా రాజకీయాల్లో ఉంటారని తేల్చి చెప్పారు. తెలంగాణ కాంగ్రెసు నేతలపై మరోమారు విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో తెరాస అధికారంలోకి వస్తే సిఎం పదవి ఎవరికి ఇస్తామనే విధాన నిర్ణయం కొద్ది రోజుల్లో ప్రకటిస్తామని, తొలి సిఎంగా దళితుడిని చేస్తామంటూ తాము ప్రకటించినప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవన్నారు. పార్లమెంటులో లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే ప్రయోగిస్తారని తాను ఊహించలేదన్నారు.

కిరణ్ ఇప్పటికీ రెండు రాష్ట్రాలను కలుపుతానని చెబుతున్నారని, టిడిపి నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడేమో.. వారి పార్టీకి 35 లోకసభ స్థానాలను ఇస్తే, రాష్ట్రాన్ని కలిపి ఉంచుతామని అంటున్నారని, ఇరు రాష్ట్రాల మధ్య నీళ్లు, ఉద్యోగాలు, ఆస్తుల పంపిణీ వంటి పెద్ద పని ఉందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఒకటి, రెండు సంవత్సరాలు చాలా ముఖ్యమన్నారు. ఈ మేరకు తెలంగాణ సిఎం అంశాన్ని త్వరలోనే ప్రకటిస్తామన్నారు.

తామేం చేసినా తెలంగాణ ప్రజల కోసమేనని, పదవులకోసం ఆరాటం కాదన్నారు. ఉద్యమాన్ని ప్రారంభించింది తానేనని, ముగించింది కూడా తానే అన్నారు. తెలంగాణ బిల్లు ఆమోదం సమయంలో జరిగిన గోల చూశానని, రాజ్యసభలో వెంకయ్యనాయుడు అడ్డుకున్న తీరును గమనించానని, దీనిని బట్టి కచ్చితంగా పోరాటం చేసే అవసరం ఉందన్నారు. అధికారం చేపట్టాక విద్యుత్ విషయంలో రెండేళ్లు కష్టాలు తప్పవని, ఆ తర్వాత రైతుల వ్యవసాయానికి 24 గంటలపాటు కరెంట్ అందిస్తామని తెలిపారు. వికలాంగులకు నెలసరి రూ.1500 పింఛన్ ఇస్తామని చెప్పారు.

అయితే ఇక్కడ సర్కారు వస్తేనే సరిపోదని, ఢిల్లీలోనూ చక్రం తిప్పాలంటే 16-17 ఎంపీ స్థానాలు తెరాస గెలవాలన్నారు. మోడీని చూసి ఓటేయొద్దని, ముందుగా మన రాష్ట్రం గురించి ఆలోచించి.. తర్వాత దేశం గురించి ఆలోచిద్దామన్నారు. తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, దొర.. బిర అంటూ పిచ్చి కూతలు కూస్తున్నారని, తెలంగాణలో తెరాస అధికారంలోకి వస్తే దొరల పాలనే అని అంటున్నారని, కానీ కమ్మ, రెడ్డి, రాజు దొరల కింద మీరు పని చేయలేదా? అని టి కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు.

మాట్లాడితే తెరాస కుటుంబ పార్టీ అంటున్నారని, మరి ఒకటే రోజు తాను, తన కొడుకు, కూతురు, అల్లుడు... నలుగురం జైలులో ఉన్నామని, ఉద్యమంలో తమ కుటుంబం ఉందన్నారు. రాజకీయాల్లోనూ తప్పక తమ కుటుంబం ఉంటుందని, ఇందులో డౌట్ అక్కర్లేదన్నారు. అయినా రాజకీయాల్లో ఎందరి కుటుంబాలు లేవని ప్రశ్నించారు. కుటుంబ పార్టీ అనేది చేతగాని వాళ్లు చెప్పే రాంగ్ ఫిలాసఫీ అని ఎండగట్టారు.

వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో, ఆ తర్వాత జరిగిన అక్రమాలన్నీ తాము అధికారంలోకి వచ్చాక బయటపెడ్తామని చెప్పారు. ఈ దఫా మెదక్ జిల్లా గజ్వేల్ అసెంబ్లీ స్థానం పోటీ చేస్తానని కెసిఆర్ ప్రకటించారు. తాను ఏ లోక్‌సభ సీటులో పోటీ చేయాలనేది ఆలోచిస్తున్నామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో తెరాస పొత్తు పెట్టుకోదని పునరుద్ఘాటించారు. ఒక్క సిపిఐతోనే పొత్తు చర్చలు జరుగుతున్నాయని, అది కూడా రెండు, మూడు రోజుల్లో తేలిపోతుందని చెప్పారు.

వచ్చే నెల 11 నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రభావవంతంగా చేపడతామని వెల్లడించారు. జయ నామ సంవత్సరం మొదలయ్యాకే (మార్చి 31న ఉగాది) తమ పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల ఉంటుందని చెప్పారు. కొండా దంపతులను తెరాసలో చేర్చుకోవటాన్ని కెసిఆర్ పూర్తిగా సమర్థించుకున్నారు. పరిస్థితుల ప్రాబల్యం నేపథ్యంలో పార్టీని నిలబెట్టుకోవాలని, తెలంగాణ సాధించటంతో ఉద్యమ ప్రస్థానం అయిపోయిందని, ఉద్యమ స్ఫూర్తిని మాత్రమే కొనసాగించాలని, పార్టీ అధికారంలోకి రావాలన్నారు.

'కొండా సురేఖ నాయకురాలు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి మంత్రిగా పనిచేశారు. ఆమె రాజకీయ అవసరం మాకు ఉంది. శక్తి ఇస్తే తీసుకోం అంటే మూర్ఖత్వమే అవుతుంది. చేతిలో అధికారం లేకపోతే బంగారు తెలంగాణను గాలిలో చేస్తామా?' అని కెసిఆర్ ప్రశ్నించారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు టికెట్లు ఇవ్వాలనే డిమాండ్‌నూ కెసిఆర్ తోసిపుచ్చారు.

అమరుల కుటుంబాల్లో కొంతమందికి టికెట్లు ఇస్తామని చెప్పామని, మరికొందరికి ఎమ్మెల్సీ అవకాశాలు కల్పిస్తామన్నారు. వాస్తవానికి వారిని అమరులను చేసింది కాంగ్రెస్ అని, ఇప్పుడు వారి కుటుంబాలతోనే ఆ పార్టీ నేతలు సమావేశాలు పెడ్తూ టికెట్లు ఇస్తామని చెబుతున్నారని, ఇదో పెద్ద డ్రామా అన్నారు.

1200 మంది అమరులున్నారని, అమరులందరి కుటుంబాలకు టికెట్లు ఇవ్వాలంటే అసెంబ్లీ సీట్ల సంఖ్యను 1200లకు పెంచాలని వ్యాఖ్యానించారు. కాగా, దుమ్ముగూడెం-టెయిల్‌పాండ్ ప్రాజెక్టుకు నిధుల మంజూరు నిలిపివేయాలని గవర్నర్ నరసింహన్‌కు ఆదివారం బహిరంగ లేఖ రాశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+