ఎన్టీఆర్ టు కిరణ్: సచివాలయం మార్పు, కేసీఆర్ భయం అదేనా?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సచివాలయాన్ని మార్చాలని నిర్ణయించుకోవడంపై విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్న విషయం తెలిసిందే. సాధారణంగా చాలామంది రాజకీయ నాయకులకు వాస్తు, జోతిష్యం తదితరాల పైన నమ్మకం ఎక్కువగా ఉంటుంది. అందులో కేసీఆర్ మరీ ముందుంటారనే చెప్పవచ్చు.
ప్రస్తుతం ఉన్న సచివాలయం వాస్తురీత్యా బాగా లేదని, అందుకే సచివాలయాన్ని ఛెస్ట్ ఆసుపత్రి వద్దకు మార్చాలని నిర్ణయించుకున్నట్లు కేసీఆర్ చెప్పారు. అయితే, కేసీఆర్ భయం పైన వివిధ రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రుల విషయం కూడా వినిపిస్తోంది.
ప్రస్తుతం ఉన్న సచివాలయంలో ప్రతి ముఖ్యమంత్రి కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. సినీ, రాజకీయ జీవితంలో ఎవరికీ అందని అంత ఎత్తులో నిలిచిన స్వర్గీయ నందమూరి తారక రామారావును అల్లుడు నారా చంద్రబాబు నాయుడు అధికారం నుండి తప్పించారనే ఆరోపణలు ఉన్న విషయం తెలిసందే.

అలాగే, సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తొమ్మిదన్నర సంవత్సరాలు పాటు ఏలిన చంద్రబాబు నాయుడును మావోయిస్టులు టార్గెట్ చేశారు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఆయన నేతృత్వంలోని టీడీపీ ఇబ్బందులను ఎదుర్కొంది. పదేళ్ల పాటు ప్రతిపక్షానికి పరిమితమైంది. అనుభవం, తెలివి ఉన్న చంద్రబాబు కూడా నెగ్గుకు రాలేకపోయారని గుర్తు చేస్తున్నారు.
2004లో చంద్రబాబును ఓడించిన వైయస్ రాజశేఖర రెడ్డి 2009లో హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. అనంతరం రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ అతను నిలదొక్కుకోలేకపోయారు. అనంతరం వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నో ఒడిదుడుకుల మధ్య రాష్ట్రాన్ని ఏలారు. ఎన్నికల అనంతరం ఆయన రాజకీయాల్లోనే కనిపించకుండా పోయారని చెబుతున్నారు.
వాస్తు, జోతిష్యాన్ని బాగా నమ్మే కేసీఆర్ తన కాన్వాయ్ నెంబర్‌ను 6666కు మార్చుకున్నారు. కేసీఆర్ అదృష్ట సంఖ్య ఆరు. కేసీఆర్‌తో పాటు తమిళనాడు మాజీ సీఎం జయలలిత, కర్నాటక మాజీ సీఎం యెడ్యూరప్ప తదితరులు చాలామంది వాస్తును నమ్ముతారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వాస్తురీత్యా రాజధానిని నిర్మిస్తున్నామని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications