టి ఇంటర్వెల్, క్లైమాక్స్ ఉంది: కెసిఆర్, బాబుపై నిప్పులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇంటర్వెల్ అని, క్లైమాక్స్ ముందుందని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వైఖరేంటో చెప్పాలని ప్రశ్నించారు. పోలవరం డిజైన్ మార్చాలని తాము కోరుతున్నామని, అలాగే ఏడు మండలాలను తెలంగాణలోనే ఉంచాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. దీనిపై చంద్రబాబు ఏమంటారో చెప్పాలన్నారు.
పోలవరం డిజైన్ మార్చకుంటే తాము ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించే ప్రసక్తి లేదన్నారు. తెలంగాణలో ఆటోలపై రవాణా పన్ను మాఫీ చేస్తామని, ఆటో రిక్షా కార్మికులకు ఆరోగ్య భీమా ఇస్తామన్నారు. తెలంగాణ ప్రాంతంలో టిడిపికి డిపాజిట్ కూడా రాదన్నారు. ఉద్యోగ పంపకాలు, పోలవరం ఏడు మండలాల పైన తెలంగాణ కాంగ్రెసు, తెలంగాణ బిజెపి, టిడిపి వైఖరులు చెప్పాలన్నారు. తెలంగాణలో తెరాస ప్రభుత్వమే ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.

తెలంగాణ ప్రజల సమస్యలను తెరాస మాత్రమే పరిష్కరిస్తుందని అందరు నమ్ముతున్నారని చెప్పారు. తెలంగాణలో ప్రాజెక్టులు నిండిన తర్వాతనే సీమాంధ్రలోని అక్రమ ప్రాజెక్టులకు నీళ్లు వదులుతామన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ఉద్యోగులు తెలంగాణ ప్రభుత్వంలో, ఆంధ్రా ఉద్యోగులు ఎపి ప్రభుత్వంలో పని చేయాల్సిందే అన్నారు. తెలంగాణ సమస్యలు తెరాసతో తప్ప ఇతర పార్టీలు అధికారంలోకి వస్తే పరిష్కారం కావన్నారు.
తెలంగాణ బిల్లును ఆపేందుకు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు రాజ్యసభలో చేసిన హంగామా అందరికీ తెలుసునన్నారు. తెలంగాణలో తెరాస ఎక్కువ సీట్లు గెలుచుకుంటే కేంద్రం మెడలు వంచి పనులు చేయించుకోవచ్చునని చెప్పారు. తెలంగాణ.. అన్ ఫినిష్డ్ స్టోరీ అని, క్లైమాక్స్ ముందు ఉందన్నారు. మన తలరాతలను మనమే మార్చుకోవాలన్నారు.
బాబు మెదడు చెడిపోయిందని, అందుకే పిచ్చికూతలు కూస్తున్నారని చెప్పారు. వివిధ పార్టీల నుండి తెరాసలోకి వస్తున్న వారికి స్వాగతం పలుకుతున్నట్లు చెప్పారు. డిఎస్, జానా లాంటి వాళ్లు ఆంధ్రా నేతల కొమ్ము కాయడానికే ఉన్నారని ఆరోపించారు. ఉద్యోగులకు ఆప్షన్ ఉండవద్దని చెప్పారు.












Click it and Unblock the Notifications