చంద్రబాబుకు చెక్: విలీనం కాదు, కాంగ్రెసుతో పొత్తే
హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీని పూర్తిగా దెబ్బ తీయడమే వ్యూహంగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తీవ్రమైన చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన మౌనంగా ఉండిపోయారు. హైదరాబాద్, 371డి, భద్రాచలం, మునగాల వంటి వివిధ అంశాలపై ఇంకా వివాదం చెలరేగుతూనే ఉంది. అయినా ఆయన మాట్లాడడం లేదు.
హైదరాబాద్‌పై ఆంక్షలు పెడితే సహించబోమని చెబుతూ వచ్చిన కెసిఆర్ కేంద్ర మంత్రుల బృందాన్ని (జివోఎంను) కలిసి వచ్చిన తర్వాత ఏమీ మాట్లాడడం లేదు. ఆయన తన ఫామ్‌హౌస్‌లో తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలపైనే ఆయన దృష్టి కేంద్రీకరించినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో కాంగ్రెసులో విలీనానికి ఆయన సుముఖంగా లేరని అంటున్నారు. కాంగ్రెసులో పార్టీని విలీనం చేసేకన్నా, అవసరమైతే పొత్తు పెట్టుకోవడమే మంచిదని ఆయన అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెసులో పార్టీని విలీనం చేస్తే తెలుగుదేశం పార్టీ ముఖాముఖి పోరాటం చేయాల్సి ఉంటుందని, దానివల్ల తెలుగుదేశం పార్టీ నిలదొక్కుకునే అవకాశం ఉంటుందని కెసిఆర్ భావిస్తున్నారని సమాచారం. తెలుగుదేశం పార్టీని పూర్తిగా దెబ్బ తీయాలంటే కాంగ్రెసు, తెరాస ఎదురుబొదురుగా నిలుచుని, అవగాహనతో పోటీ చేయడం అవసరమని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇందుకు అనుగుణంగా వ్యూహరచన చేసుకుంటున్నట్లు చెబుతున్నారు.
అయితే, తెరాసతో పొత్తుకే కాంగ్రెసు పార్టీ మొగ్గు చూపుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. విభజన ప్రక్రియలో తమను కాంగ్రెసు అధిష్టానం పట్టించుకోవడం లేదనే అసంతృప్తి కూడా కెసిఆర్‌కు ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే ఆయన విలీనం ఉండదని, తెలంగాణ పునర్నిర్మాణానికి పాటు పడాల్సి ఉంటుందని, ఆ పునర్నిర్మాణంలో తమ పాత్ర పోషిస్తామని కెసిఆర్ అంటున్నట్లు చెబుతున్నారు.

తెరాస కాంగ్రెసులో విలీనమైతే బిజెపి, తెలుగుదేశం పార్టీలు కలిసి పోటీ చేస్తే ఆ పార్టీలకు చోటు కల్పించినట్లవుతుందని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఆ పార్టీల కూటమి చీల్చుకునే అవకాశం ఉంటుందని కెసిఆర్ భావిస్తున్నారని అంటున్నారు. పార్లమెంటు శీతాకాలం సమావేశాల్లో పాల్గొనడానికి కెసిఆర్ వచ్చే నెల 3వ తేదీన ఢిల్లీ వెళ్లే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఉద్యమంలో పాల్గొననివారి చేతుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని పెడితే నష్టోపాతమని, కెసిఆర్ చేతుల్లోనే తెలంగాణ పునర్నిర్మాణం జరగాలని హరీష్ రావు మంగళవారంనాడు అన్నారు. దీన్నిబట్టి కాంగ్రెసులో పార్టీ విలీనాన్ని వ్యతిరేకించే వర్గం కూడా తెరాసలో ఉన్నట్లు అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications