మొండోడ్ని, వదల: టీవీ9,ఆంధ్రజ్యోతికి కెసిఆర్ హెచ్చరిక
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుక్రవారం అసెంబ్లీలో టీవీ 9 ఛానల్, ఆంధ్రజ్యోతి దిన పత్రిక పైన మండిపడ్డారు. టీవీ 9 తెలంగాణ శాసన సభను, శాసన సభ్యులను తీవ్రంగా అవమానించిందని కెసిఆర్ నిప్పులు చెరిగారు.
అసెంబ్లీలో తెలంగాణ శాసన సభ్యులు కూర్చుంటే.. టూరింగ్ సినిమాలో కూర్చున్న వారిని మల్టీప్లెక్స్‌లో కూర్చుండబెట్టినట్లు ఉందని చెబుతున్నారని, పాచికల్లు తాగిన మొహాలని అంటున్నారని ఆయన అన్నారు. తెలంగాణ సభ్యులను అవమానించేందుకు ఇంత అహంకారమా అన్నారు.
కొన్ని ఆంధ్రా పత్రికలు కూడా తెలంగాణ ప్రభుత్వం పైన విషం కక్కుతున్నాయని, అందులో ముఖ్యంగా ఆంధ్రజ్యోతి దిన పత్రిక అన్నారు. ప్రతిరోజు ఆ పత్రిక తెరాస ప్రభుత్వంపై విషం కక్కుతోందన్నారు. ఆంధ్రా అహంకారం చూపించే కొన్ని పత్రికలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం ప్రకటించని పాలసీలను ప్రకటించినట్లుగా రాస్తున్నారన్నారు.

తాను ఇలాంటి మీడియా సంస్థలను హెచ్చరిస్తున్నానని, వారిని వదిలి పెట్టే ప్రసక్తి లేదన్నారు. నేను చాలా మొండిఘటాన్ని అన్నారు. ఇలాంటి పిట్ట బెదిరింపులకు తాను భయపడనని, వదిలి పెట్టనని హెచ్చరించారు. వలసవాదుల అహంకారం కింద తెలంగాణ ఇన్నాళ్లు ఎంతో గోసపడిందన్నారు. అవసరమైతే తమిళనాడులో జయలలిత తెచ్చినట్లు కేబుల్ చట్టం తెస్తానని చెప్పారు. ఏ ధైర్యంతో అడ్డగోలుగా వార్తలు రాస్తున్నాయన్నారు.
ప్రివిలేజ్ మోషన్ ఇవ్వాలి: జీవన్ రెడ్డి
తెలంగాణ శాసన సభ్యులను అవమనించిన మీడియా సంస్థల పైన ప్రివిలేజ్ మోషన్ ఇవ్వాలని కాంగ్రెసు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సూచించారు. సదరు మీడియా సంస్థల చర్యలను తాను ఖండిస్తున్నానని చెప్పారు.












Click it and Unblock the Notifications