ఢీ అంటే ఢీ: APలోకి KCR... తెలంగాణలోకి చంద్రబాబు!!
భారత రాష్ట్ర సమితి జాతీయ పార్టీగా గుర్తింపు పొందడానికి అవరమైన ఓట్ల శాతంలో కొంత ఏపీ నుంచి వస్తుందనే నమ్మకాన్ని, ఆశను కేసీఆర్ పెట్టుకున్నట్లే కనపడుతోంది. రాష్ట్రంలో తాను నేరుగా అడుగుపెట్టడం వేరు.. పార్టీ తరఫున మనుషులను పంపించడం వేరని ఆయన భావిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్ర విభజనకు కేసీఆర్ కారకుడని ఏపీ ప్రజలు ఆగ్రహంతో ఉండటమే అందుకు ప్రధాన కారణం.

ఏపీ ఇన్ ఛార్జిగా తలసాని
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఏపీ కార్యక్రమాల ఇన్ ఛార్జిగా నియమించారు. తెలుగుదేశం పార్టీ నేతలతో తలసానికి బంధుత్వాలున్నాయి. యనమల రామకృష్ణుడు, పుట్టా సుధాకర్ యాదవ్ కు తలసానితో బంధుత్వం ఉంది. సంక్రాంతి తర్వాత ఏపీలో బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ తలపోస్తున్నారు. అందుకు కావల్సిన స్థల సేకరణ, పార్టీ కార్యాలయ నిర్మాణ బాధ్యతలు కూడా తలసానికే అప్పజెప్పారు. విజయవాడకు సమీపంలోని జక్కంపూడిలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని నిర్మించబోతున్నారు.

బీఆర్ఎస్ ఎంత వేగంగా కదులుతుందో టీడీపీకి అంత మంచిది!
ఏపీలో బీఆర్ఎస్ కదలికలు ఎంత ఎక్కువగా ఉంటే తమకు అంతమంచిదని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును సెంటిమెంట్ తో అడ్డుకుంటున్న కేసీఆర్ ఏపీలో కార్యకలాపాలు ప్రారంభిస్తే అంతకంటే వేగంగా చంద్రబాబు తెలంగాణ జిల్లాల్లోకి ప్రవేశించే అవకాశం కనపడుతోంది. ఏపీలో కేసీఆర్ ఉన్నారు కాబట్టి తెలంగాణలో తానుండటంవల్ల ఇరువురి మధ్య, ఇరుపార్టీల మధ్య ఈక్వేషన్ సరిపోతుందంటున్నారు. కేసీఆర్ తన బీఆర్ఎస్ ప్రణాళిక ప్రకటించిన వెంటనే చంద్రబాబునాయుడు చురుగ్గా వ్యవహరించారు. కాసాని జ్ఞానేశ్వర్ ను పార్టీ అధ్యక్షుడిగా చేశారు. ఆ తర్వాత పార్టీలో చేరికలు పెరుగుతున్నాయి. ఈనెల 21వ తేదీన ఖమ్మంలో భారీ బహిరంగసభను ఏర్పాటు చేయబోతున్నారు. కొంతమంది సీనియర్ నాయకులు కూడా తిరిగి టీడీపీలో చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు.

సరిహద్దులు పంచుకుంటున్న జిల్లాల్లో..
తెలుగుదేశం పార్టీకి బలమున్న ఖమ్మం, గ్రేటర్ హైదరాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో పోటీచేయడానికి దారులు ఏర్పడతాయి. మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలు ఏపీతో సరిహద్దులు పంచుకుంటున్నాయి. ప్రస్తుత ఎన్నికలకు తనకు బలమున్నచోట్లే నిరూపించుకొని పోటీచేయాలని టీడీపీ ఆలోచన చేస్తోంది. ఎన్నికల ఫలితాలనుబట్టి తర్వాత పార్టీని మరింత విస్తరించే అవకాశం ఉందంటున్నారు. ఏమైనాకానీ కేసీఆర్ అటు ఏపీలో, చంద్రబాబు ఇటు తెలంగాణలో అడుగు పెట్టనుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.












Click it and Unblock the Notifications