ఏపీలో కేసీఆర్ అడుగుపెట్టేది అక్కడ నుండేనా.. ఈ సారైనా సక్సెస్ అవుతారా?
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టడం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. అదనుచూసి అడుగుపెట్టాలని, వేసే తొలి అడుగే ప్రజల మద్దతు పూర్తిగా తమవైపు ఉండేలా వెయ్యాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఏపీలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తారని ఇప్పటివరకు భావించినప్పటికీ, ఆ ప్రయత్నాలేవీ సాకారం కాలేదు.
ఏపీలో కాలు పెట్టడానికి అనేక అంశాలను బిఆర్ఎస్ తీసుకుంటున్నా, ఆయా అంశాలపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు రావడం లేదు. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీలో సమస్య ఉన్న రాజధాని విషయంలో బిఆర్ఎస్ స్టాండ్ ను పార్టీ నేతల ద్వారా వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని రాజధాని విషయంలో బీఆర్ఎస్ మద్దతు రాజధానిగా అమరావతికే ఉంటుందని పేర్కొన్నారు. మూడు రాజధానులకు తాము అనుకూలం కాదన్నారు.

అయినప్పటికీ ప్రజల నుంచి బీఆర్ఎస్ కు మద్దతు దక్కలేదు. ఆపై విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అవసరమైతే బిడ్ వేసి కొనుగోలు చేస్తామని ప్రయత్నాలు చేసినప్పటికీ, అందులో కూడా ఫెయిల్ అయ్యారు. దీంతో ఏపీలో కాలు పెట్టడానికి ఆయనకు మంచి అవకాశం లేకుండా పోయింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయల తెలంగాణ అంశం ప్రధానంగా వినిపిస్తుండటంతో సీఎం కేసీఆర్ రాయలసీమపై ఫోకస్ చేస్తున్నట్టుగా ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది.
రాయలసీమలోని నాలుగు జిల్లాలను కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలనే డిమాండ్ రాష్ట్ర విభజన చేయకముందు నుండి ఉంది. దీనిని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో కెసిఆర్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఏపీలో అడుగు పెట్టాలి అంటే, ప్రస్తుతం కెసిఆర్ కు ఉన్న ఆప్షన్ రాయలసీమ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు రాయలసీమలో చాలామంది దిగ్గజనాయకులు ఉన్నారు. వారంతా రాజకీయంగా సరైన ప్రోత్సాహం లేక సైలెంట్ గా ఉంటున్నారు.

మైసూరా రెడ్డి, డిఎల్ రవీంద్రారెడ్డి, బైరెడ్డి రాజశేఖర్, తులసి రెడ్డి వంటి నాయకులు సరైన వేదిక కోసం ఎదురు చూస్తున్నారు. సీఎం కేసీఆర్ రాయలసీమలో కాలు పెడితే వీరిని పార్టీ వైపు ఆకర్షించడానికి అవకాశం ఉంటుందని కూడా పలువురు భావిస్తున్నారు. ఈ క్రమంలో కెసిఆర్ ఏపీలో రాయలసీమను తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించడానికి వేదిక చేసుకుంటారా? ఈ ప్రయత్నంలో ఆయన సక్సెస్ అవుతారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications