మంత్రిదీ మూసేశాం, తోలుతీస్తా: కేసీఆర్, బాబు పైనా..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుట్రలు మరో నాలుగైదు నెలలు మాత్రమే సాగుతాయని, తనను ఇంజినీరింగ్ కళాశాలలు బ్లాక్ మెయిల్ చేస్తే తాట తీస్తానని, ఆడపిల్లల వైపు చూడాలంటేనే భయపడేలా చేస్తానని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర సమితి విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు.
చంద్రబాబు ఆటలు సాగవు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆటలు ఇకముందు సాగవన్నారు. చంద్రబాబు ఇంకా కర్కోటకుడిలా తెలంగాణ రాష్ట్రాన్ని ఇబ్బందులు పెడుతున్నాడని ధ్వజమెత్తారు. ఇంకో నాలుగైదు నెలలు మాత్రమే చంద్రబాబు ఆటలు సాగుతాయన్నారు. సమైక్య రాష్ట్రంలో టీపీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డిలు బానిసలుగా బతికారని విమర్శించారు. పీవీని కాంగ్రెస్ వారు గౌరవించనప్పటికీ తెలంగాణ స్ఫూర్తితో తాము గౌరవిస్తున్నామన్నారు.

ఆంధ్రా నేతల విగ్రహాలు ఉండొద్దు
ట్యాంక్ బండ్ పైన ఏ ఒక్క ఆంధ్రా నేతల విగ్రహాలు ఉండవద్దని కేసీఆర్ అన్నారు. ఉద్యమంలో పాల్గొన్న కార్యకర్తలకే నామినేటెడ్ పోస్టులు ఇస్తామని చెప్పారు. నాలుగేళ్లలో ప్రతి ఇంటికి నల్లా నీరు అందించకుంటే ఓట్లు అడగమని చెప్పారు. మూడేళ్ల పాటు విద్యుత్ కష్టాలు తప్పవని పునరుద్ఘాటించారు.
ఆడపిల్లల వైపు చూడాలంటే భయపడేలా చేస్తా
ఆడపిల్లలకు, మహిళలకు వేధింపుల పైన ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఇక ముందు ఆడపిల్లల వైపు చూడాలంటేనే భయపడేలా చేస్తానన్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో అందుకోసం ప్రత్యేక చట్టం తీసుకు వస్తామని చెప్పారు.
తోలు తీస్తా, మా మంత్రిదీ మూసేయించా
ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు తనను బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తే తోలు తీస్తానని హెచ్చరించారు. ఫౌల్ట్రీ ఫాంలు, బర్ల కొట్టాలే మన ఇంజినీరింగ్ కళాశాలలు అన్నారు. మా మంత్రి మహేందర్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలను కూడా మూసివేయించానని తెలిపారు.
దళితులకు భూములు
తాము దళితులకు భూమి ఇవ్వడమే కాకుండా మూడు నెలలకు ఓసారి సమీక్షిస్తామని చెప్పారు. హైదరాబాదు, ఇతర దేశాల్లో స్థిరపడ్డ వారు ప్రభుత్వానికి భూములు ఇవ్వాలని కోరారు. ఆ భూములకు సముచిత ధరను ఇచ్చి తీసుకుంటామని చెప్పారు.
చెరువుల పూడికతీత కోసం తట్టలు మోస్తా
చెరువుల పూడికతీతను చారిత్రాత్మకంగా తీసుకుందామన్నారు. తాను పది జిల్లాల్లో పది తట్టలు మోస్తానని చెప్పారు. ఊరురా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఊరూరా మొక్కలు నాటాలి - వర్షాలు వాపస్ రావాలి అనే నినాదంతో ముందుకు పోదామన్నారు.
ఎమ్మెల్యేలకు హైదరాబాదులో పనేంటి
ఎమ్మెల్యేలకు హైదరాబాదులో పనేమిటని కేసీఆర్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు నిత్యం నియోజకవర్గంలోనే ఉండాలని సూచించారు.












Click it and Unblock the Notifications