వైసిపి ఎమ్మెల్యేలు టిడిపిలో చేరడానికి ఇదీ కారణం: కెఈ కృష్ణమూర్తి
కర్నూలు: తనతో టిడిపి ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని, సమయం వచ్చినప్పుడు ప్రభుత్వాన్ని కూల్చేస్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్న తర్వాతనే ఆ పార్టీ నుంచి తమ పార్టీలోకి చేరికలు ప్రారంభమయ్యాయని ఉప ముఖ్యమంత్రి, టిడిపి నేత కెఈ కృష్ణమూర్తి అన్నారు.
ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు. రాయలసీమ నుంచి టిడిపిలోకి ఇంకా వలసలు ఉంటాయని చెప్పారు. ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేయవలసిన అవసరం తమకు లేదని చెప్పారు. జగన్ పైన అసంతృప్తితోనే వారు తమ పార్టీలోకి వస్తున్నారన్నారు.
ప్రభుత్వాన్ని ఇరవై నాలుగు గంటల్లో కూల్చేస్తామని జగన్ రాజ్ భవన్ ఎదుట జగన్ వ్యాఖ్యానించారని, ఆ వ్యాఖ్యల వల్లే ఇప్పుడు వైసిపి ఖాళీ అవుతోందని మండిపడ్డారు. కొత్తవారిని కలుపుకొని ముందుకు పోతామన్నారు.
వారి చేరికలతో పార్టీ బలోపేతమైందన్నారు. కొత్తవారిని కలుపుకునే దిశగా క్షేత్రస్థాయిలో ప్రయత్నిస్తామన్నారు. ప్రభుత్వాన్ని కూల్చుతానని జగన్ చెప్పాకే తమ పార్టీలోకి చాలామంది వస్తున్నారన్నారు. కొడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ టిడిపిలో చేరిన సమయంలో కెఈ కృష్ణమూర్తి విలేకరులతో మాట్లాడారు.

చేరికల పైన శిల్పా స్పందన
కర్నూలు జిల్లాలో పాత, కొత్త అందరం కలిసి పని చేస్తామని శిల్పా మోహన్ రెడ్డి బుధవారం చెప్పారు. ఇటీవల వైసిపికి చెందిన ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శిల్పా మోహన్ రెడ్డి స్పందించారు.
కర్నూలు జిల్లాలో గ్రూపు రాజకీయాలకు అవకాశమే లేదని చెప్పారు. అందరం కలిసి పని చేస్తామన్నారు. శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ... వైసిపి నుంచి టిడిపిలోకి చేరేందుకు మరికొంతమంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తమ పార్టీ చేపడుతున్న పథకాలకు వారు ఆకర్షితులై చేరుతున్నారన్నారు. తాము అందర్నీ కలుపుకుపోతామన్నారు.












Click it and Unblock the Notifications