బాబుపై కేఈ అసహనం వెనుక..: జగన్ పావులు..?
హైదరాబాద్: మంత్రి కేఈ కృష్ణమూర్తి రెండు రోజుల క్రితం అసెంబ్లీ ప్రాంగణంలో చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీలో తీ వ్ర చర్చకు దారి తీస్తున్నాయి. సభలో అంతా చంద్రబాబే మాట్లాడుతున్నారని, మంత్రులకు అవకాశం ఇవ్వడం లేదని, పదేపదే చంద్రబాబు మాట్లాడటం వల్ల ప్రతిపక్ష పార్టీకి కలిసి వస్తోందని, జగన్ గతంలో కంటే మెరుగయ్యారని కేఈ అభిప్రాయపడ్డ విషయం తెలిసిందే.
ఆయన అలా ఎందుకు వ్యాఖ్యానించారనే చర్చ టీడీపీలో సాగుతోంది. ఉప ముఖ్యమంత్రి అయిన కేఈ రెవెన్యూ మంత్రిగా ఉన్నారు. రాజధాని బిల్లు (సీఆర్డీఏ) విషయంలో తనకు ప్రాధాన్యత తగ్గించారనే అభిప్రాయంతోనే ఆయన ఘాటు వ్యాఖ్యలు చేసి ఉంటారని అంటున్నారు. అలాగే అధికారుల బదిలీల విషయంలోను ఆయన అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే, సభలో ఎమ్మెల్యేలు చెప్పలేని పరిస్థితుల్లోనే చంద్రబాబు కల్పించుకుంటున్నారని మరికొందరు అంటున్నారు.
పలువురు సీమ నేతల్లో అసంతృప్తి?

టీడీపీ రాయలసీమ నేతల్లో అసంతృప్తి చాపకింద నీరులా విస్తరిస్తోందని అంటున్నారు. అనంతపురం మినహా మిగిలిన మూడు జిల్లాల్లో ప్రజలు వైసీపీకి మద్దతివ్వడంతో చంద్రబాబు రాయలసీమపై దృష్టి సారించడం లేదనే వ్యాఖ్యలు కూడా తాజాగా తోడవుతున్నాయి.
విజయవాడ, విశాఖపట్టణం అంటూ తరచూ పర్యటిస్తూ పాలన కొనసాగిస్తున్నారే తప్ప రాయలసీమలోని పలు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజధాని నగరం విషయంలో సైతం రాయలసీమ ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదని వారంటున్నారు.
మంత్రిమండలిలో చంద్రబాబు అంతా తానై వ్యవహరిస్తున్నారని, అసెంబ్లీలో సైతం మంత్రులు ఇవ్వాల్సిన సమాధానాలను చంద్రబాబే ఇచ్చారని ఉప ముఖ్యమంత్రి కేఈ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన అనంతపురం జిల్లా నేత జేసీ దివాకర్‌రెడ్డి ఇటీవలి కాలంలో మౌనం వహించారు.
కాగా టిడిపిలో రాజుకుంటున్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో వైసీపీ తన వంతు ప్రయత్నాలు చేస్తోందంటున్నారు. రాయలసీమలోని ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాము పోరాటం చేయడమే కాకుండా ఎవరు ఆందోళన నిర్వహించినా సహకారమందిస్తామని చెబుతోంది. రాజధానిని తరలించిన నేపథ్యంలో అత్యధిక సంస్థలు రాయలసీమకు కేటాయించాలని సీమ టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు వ్యవసాయంపై ప్రధానంగా ఆధారపడిన రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ తక్షణం నిధులను విడుదల చేయాలని కోరుతున్నారు. నీటి సమస్య తీర్చాలంటున్నారు. రాయలసీమ పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికపుడు చంద్రబాబు తెలుసుకుంటున్నట్లుగా కూడా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications