టీడీపీ హ్యాట్రిక్ కు వైసీపీ యువనేత బ్రేకులు వేస్తారా..!!
ఏపీలో పలు నియోజకవర్గాల్లో ఎన్నికలు హోరా హోరీగా సాగుతున్నాయి. విజయవాడ నగర పరిధిలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2019లో వైసీపీ రెండు స్థానాలు గెలిచింది. ఈ సారి మూడు నియోజకవర్గాల పైన టీడీపీ, వైసీపీ ఫోకస్ చేసాయి. పశ్చిమం నుంచి బీజేపీ అభ్యర్ది సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు. సెంట్రల్ సీటులో బోండా ఉమ వర్సస్ వెల్లంపల్లి మధ్య పోటీ జరుగుతోంది. తూర్పు నియోజకవర్గంలో ఫలితం పైన ఆ సారి ఆసక్తి కనిపిస్తోంది.
హ్యాట్రిక్ దక్కేనా
విజయవాడ తూర్పు నుంచి హ్యాట్రిక్ సాధించేందుకు తెలుగుదేశం పార్టీ తరపున గద్దె రామ్మోహన్ బరిలో నిలవగా వైసీపీ తరపున మాజీ మంత్రి దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్ మొదటిసారిగా తూర్పు బరిలో ప్రత్యర్థిగా తలపడుతున్నారు. కాంగ్రెస్, వామపక్షాల అభ్యర్థి రంగంలో ఉన్నప్పటికీ గత ఎన్నికల మాదిరిగానే టీడీపీ కూటమి, వైసీపీ మధ్య ద్విముఖ పోటీ కనిపిస్తోంది.

గద్దె రామ్మోహన్ పోటీ చేయటం ఇది నాలుగోసారి. 2009లో ఓటమి చెందినా 2014, 2019లో గెలుపొందారు. గత ఎన్నికల్లో జన సేన కూడా రంగంలో నిలిచింది. ఆ పార్టీ తరపున పోటీ చేసిన బత్తిన రాము గణనీయంగా 30వేల పైచిలుకు ఓట్లు సాధించారు. ఈసారి టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ బరిలో ఉన్నారు.
రామ్మోహన్ వర్సస్ అవినాశ్
గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన బత్తిన రాము ఇప్పుడు వైసీపీలో చేరారు. 2019లో వైసీపీ తరఫున పోటీ చేసిన బొప్పన భవకుమార్ ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరి గద్దెకు మద్దతు ఇస్తున్నారు.గద్దె రామ్మోహన్ తన రాజకీయ ప్రస్థానాన్ని గన్నవరం నియోజకవర్గం నుంచి ప్రారంభించారు. 1994లో స్వతంత్రంగా పోటీ చేసి గెలుపొంది టీడీపీలో చేరారు.
1999లో విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2004లో కంకిపాడు నుంచి పోటీ చేసి దేవినేని నెహ్రూపై ఓడిపోయారు. 2014, 2019 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఈ సారి గెలిచి హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీ వ్యూహాత్మకంగా దేవినేని అవినాశ్ ను బరిలోకి దింపింది.

గెలుపు దక్కేదెవరికి
అవినాశ్ కు బత్తిన రాము, మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి మద్దతు కలిసొచ్చే అంశం. విజయవాడ తూర్పులో అవినాశ్ దాదాపు ఏడాదిన్నార కాలంగా పని చేసుకుంటున్నారు. క్రిష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్, పేదలకు ఇంటి స్థలాలు, సంక్షేమ పథకాల ఓట్ బ్యాంక్ కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు.
రామ్మోహన్ రెండు సార్లు గెలిచి ఉండటంతో స్థానికంగా ఉన్న సత్సంబంధాలు కలిసి వస్తాయని భావిస్తున్నారు. జనసేనతో పొత్తు తో గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో అవినాశ్ సైతం తాను తూర్పు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతానని చెబుతున్నారు. దీంతో, తూర్పు లో ఎన్నికల ఫలితం పైన రాజకీయంగా ఆసక్తి కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications