కేజ్రీవాల్ విక్టరీ: బిజెపి డీలా - కెసిఆర్, బాబు, జగన్ ఖుషీ
హైదరాబాద్: ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో బిజెపి మట్టి కరవడం తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. బయటకు చెప్పకపోయినా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు అది ఆనందం కలిగించే విషయమే. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు కొంత ఊరట కలిగించే విషయం. ప్రధాని నరేంద్ర మోడీ వైఖరి మారి కాస్తా తమకు మేలు చేసేందుకు దిగివస్తారనే ఆనందం కెసిఆర్, చంద్రబాబులకు కలుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం చంద్రబాబుకు అంతగా సంతోషం కలిగించే విషయం కాకపోయినా, బిజెపి ఓటమి ఆయనకు కొంత వెసులుబాటును కలిగించే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవడానికి నరేంద్ర మోడీ ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయనేది చంద్రబాబు ఆలోచన. అలాగే, రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో నరేంద్ర మోడీ పునరాలోచనలో పడుతారని అంటున్నారు. రాష్ట్రానికి ఆర్థిక సాయాన్ని రాబట్టుకోవడానికి చంద్రబాబు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. ఢిల్లీ ఓటమి వల్ల నరేంద్ర మోడీ మెతక వైఖరి తీసుకుని ఆలోచిస్తారని ఆయన అనుకుంటారని చెబుతున్నారు.
కాగా, తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందనే అభిప్రాయం ఉంది. ఈ విషయాన్ని మాట్లాడడానికి కూడా వీలు లేనంతగా కేంద్ర ప్రభుత్వం నుంచి కెసిఆర్‌పై ఒత్తిడి పెరుగుతోంది. ఈ స్థితిలో కేంద్ర ప్రభుత్వానికి దగ్గర కావడానికి కెసిఆర్ ప్రయత్నిస్తున్నారు. అయినా, అంతగా ఫలితం ఉండడం లేదు. ఢిల్లీ ఓటమి కారణంగా నరేంద్ర మోడీ వైఖరిలో మార్పు వచ్చి, తమ పట్ల కొంత సానుకూల వైఖరి ప్రదర్శిస్తారనే ఆనందం కెసిఆర్‌కు ఉండడానికి వీలుందని అంటున్నారు.

కాగా, కేసుల్లో ఇరుక్కున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైయస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రం ఏ స్థితిలో ఏ విధంగా వ్యవహరిస్తుందో తెలియని పరిస్థితిలో ఉన్నారు. తనపై కేసుల కారణంగా ఆయన కేంద్ర ప్రభుత్వంపై గానీ బిజెపిపై గానీ అంతగా సమరానికి కాలు దువ్వడం లేదు. అయితే, ప్రస్తుత పరిస్థితిలో తన అవసరం ఉంటుందనే భావనతో నరేంద్ర మోడీ గానీ, బిజెపి సీనియర్ నేతలు గానీ కాస్తా మెతకగానే వ్యవహరించవచ్చునని జగన్ అనుకోవడానికి వీలుందని అంటున్నారు.
కాగా, నరేంద్ర మోడీ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలని దూకుడుగా వ్యవహరిస్తున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బిజెపి నాయకులకు ఢిల్లీ ఫలితాలు తీవ్ర నిరాశను కలిగించాయి. మోడీ విజయాలను ఎవరూ అడ్డుకోలేరనే అభిప్రాయాన్ని ఢిల్లీ ఫలితాలు దెబ్బ తీశాయి. దీంతో పార్టీ విస్తరణకు ఇరు రాష్ట్రాల్లో బిజెపికి ఆటంకాలు ఏర్పడవచ్చు. హైదరాబాదులోని తెలంగాణ పార్టీ కార్యాలయం మంగళవారంనాడు బోసి పోయింది. బిజెపి నాయకులు ఫలితాలపై వ్యాఖ్యానించడానికి కూడా ఇష్టపడడం లేదు.












Click it and Unblock the Notifications