పవన్ బర్త్ డే ఘనంగా నిర్వహించిన టీడీపీ ఎంపీ..! జనసేనానిపై ప్రశంసలు..!
ఏపీలో అధికార కూటమిలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు (Chandrababu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మధ్య తాజాగా గ్యాప్ నెలకొందన్న ప్రచారం జరుగుతోంది. పవన్ తరచుగా కేబినెట్ భేటీలకు, చంద్రబాబు పాల్గొంటున్న కీలక కార్యక్రమాలకు హాజరు కాకపోవడంతో ఈ ప్రచారం సాగుతోంది. అలాగే పవన్ కళ్యాణ్ స్దానిక ఎన్నికల్లో జనసేన పోటీపై చేస్తున్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇలాంటి సమయంలో టీడీపీ ఎంపీ ఒకరు ఆయన పుట్టినరోజును ఇవాళ ఘనంగా నిర్వహించడంతో పాటు జనసేనాని నాయకత్వంపైనా ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశమైంది.
విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని (Kesineni Chinni) ఇవాళ ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. తిరువూరు జనసేన పార్టీ ఇంచార్జి మనుబోలు శ్రీనివాసరావు, జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరంమని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. చంద్రబాబు-పవన్ కళ్యాణ్ మైత్రి రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది అని అన్నారు. కూటమి ఐక్యతతోనే ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లగలమన్నారు.

ఎన్టీఆర్ జిల్లా కూటమి తరఫున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. గతంలో రాష్ట్రంలో సాగిన దుష్ట పరిపాలనకు చరమగీతం పాడేందుకు పవన్ కళ్యాణ్ చేసిన పోరాటం, కూటమి ఏర్పాటులో ఆయన పోషించిన కీలక పాత్రను రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మరువరని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. ఎలాంటి వ్యక్తిగత లేదా రాజకీయ లాభాలను ఆశించకుండా, రాష్ట్ర అభివృద్ధి కోసం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా కలిసి పనిచేస్తేనే ఆంధ్రప్రదేశ్‌ను మరింత అభివృద్ధి చేయగలమని ఆలోచించిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ప్రశంసించారు. పవన్ కళ్యాణ్ చేసే ప్రతి పని రాష్ట్ర ప్రయోజనం, ప్రజల ప్రయోజనం కోసమేనని ఎంపీ తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం యువత పవన్ కళ్యాణ్‌ను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications