కొడాలి నాని అనుమానాలు నిజం అయ్యాయా?
Kodali Nani: సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో చోటు చేసుకుంటోన్న పరిణామాలు ఆ పార్టీకి మింగుడు పడట్లేదు. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ అనుసరిస్తోన్న ధోరణి- సీనియర్లను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తోంది. పార్టీని వీడి బయటికి వెళ్లిపోయేలా చేస్తోంది.
విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని నాని వ్యవహారమే దీనికి నిదర్శనం. చంద్రబాబు వైఖరి వల్ల కేశినేని నాని తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. పార్టీకీ గుడ్‌బై చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. విజయవాడ టీడీపీ యువ నాయకురాలు కేశినేని శ్వేత టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా గుడ్‌బై చెప్పారు.

ఈ వ్యవహారంపై మాజీ మంత్రి, గుడివాడకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు కొడాలి నాని స్పందించారు. చంద్రబాబు, నారా లోకేష్‌పై ఘాటు విమర్శలు గుప్పించారు. వారిద్దరి చేతుల్లో టీడీపీ భూస్థాపితం అవుతుందంటూ జోస్యం చెప్పారాయన. వచ్చే ఎన్నికలే టీడీపికి ఆఖరివి అవుతాయని తేల్చి చెప్పారు.
చంద్రబాబు అసెంబ్లీ, లోక్‌సభ టికెట్లను అమ్ముకుంటున్నాడంటూ కొడాలి నాని ఆరోపించారు. విజయవాడ లోక్‌సభ టికెట్‌ను చంద్రబాబు 150 కోట్ల రూపాయలకు బేరం పెట్టాడని, అందుకే వరుసగా రెండుసార్లు గెలిచిన కేశినేని నానికి పొగబెట్టారని మండిపడ్డారు. 150 కోట్ల రూపాయలను ఇవ్వడానికి కేశినేని చిన్ని సిద్ధపడటం వల్లే ఆయనకు టికెట్ ఇస్తారని అన్నారు.

కష్ట కాలంలో పార్టీ కోసం పని చేసిన కేశినేని నానిని చంద్రబాబు మోసం చేశాడని కొడాలి నాని విమర్శించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీని నిలబెట్టడానికి కేశినేని ఎంతగానో కష్టపడ్డారని వ్యాఖ్యానించారు. అలాంటి నాయకుడికి మోసం చేశాడని, వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కదని అన్నారు.
గుడివాడలో కూడా తనపై అభ్యర్థిని పోటీకి నిలబెట్టడానికి 100 కోట్ల రూపాయలను తీసుకున్నాడని కొడాలి నాని ధ్వజమెత్తారు. 100 కోట్ల రూపాయలు ఇచ్చిన వ్యక్తికి సీటు ఇచ్చాడని ధ్వజమెత్తారు. రాజ్యసభ, ఎమ్మెల్సీ సీట్లను కూడా చంద్రబాబు అమ్ముకుంటున్నాడన్నాడని విమర్శించారు.












Click it and Unblock the Notifications