పోలవరం పై నేడు తేల్చేస్తారా - సీఎంతో భేటీ తరువాత : అదే జరిగితే..!!
ఏపీ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పై కీలక భేటీ కి నిర్ణయించారు. ఢిల్లీ కేంద్రంగా ఈ రోజు సమావేశం జరగనుంది. కేంద్ర జలశక్తి మంత్రి ఈ నెల 4వ తేదీన పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. అంతకు ముందే సీఎం జగన్ తో సమావేశమయ్యారు. సీఎం - కేంద్ర మంత్రి కలిసి ప్రాజెక్టు సందర్శించటంతో పాటుగా పునారావాస ప్రాంతం వారితోనూ మాట్లాడారు. అధికారులతో సమీక్షించిన సమయంలో.. ప్రాజెక్టును వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేసేలా ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించిన విషయాన్ని కేంద్ర మంత్రికి స్పష్టం చేసారు. అదే సమయంలో కేంద్రం నుంచి పోలవరం విషయంలో పూర్తి సహకారం ఉంటుందని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.
దీంతో పాటుగా.. పనులు వేగవంతం చేసే క్రమంలో 3నెలలపాటు ప్రతి 15రోజులకోసారి పనుల పురోగతిపై సమీక్షిస్తానని కేంద్ర మంత్రి ప్రకటించారు. అందులో భాగంగా ఈ సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో కేంద్రం మంత్రి సైతం పాల్గొనే ఛాన్స్ ఉంది. కేంద్ర జలశక్తిశాఖలోని ఉన్నతాధికారులు, ప్రాజెక్టు అథారిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి, సభ్య కార్యదర్శి హాజరవుతారు. ఏపీ జలవనరులశాఖ ఉన్నతాధికారులు, పోలవరం అధికారులు, ఇతర ఇంజినీర్లు మంగళవారం రాత్రే దిల్లీకి చేరుకున్నారు. కేంద్ర జలసంఘం సభ్యులు, కేంద్ర జలవిద్యుత్ పరిశోధన కేంద్రం నిపుణులు, సీఎస్‌ఎంఆర్‌ఎస్ నిపుణులు, డ్యాండిజైన్ రివ్యూ ప్యానెల్ సభ్యులు హాజరవుతున్నారు. కీలకమైన ప్రాజెక్టు డీపీఆర్2 ఇప్పటికీ ఆమోదం పొందలేదు.

సవరించిన అంచనాల కమిటీ సిఫార్సు మేరకు రూ.47,725 కోట్ల వరకు కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర ఆర్థిక శాఖలు ఆ మొత్తానికి పెట్టుబడి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి 15రోజులకోసారి బిల్లులు చెల్లించాలన్న డిమాండు ను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ముందు ఉంచింది. ప్రాజెక్టు పనులు వేగంగా ముందుకు సాగాలంటే ప్రధానంగా నిధుల సమస్య పరిష్కారంతోపాటు ఆకృతులు ఆమోదం పొందాల్సి ఉంది. అవసరమైన ఆకృతులన్నీ ఆమోదిస్తే పనులు త్వరగా పూర్తి చేస్తామని కేంద్ర మంత్రికి పోలవరం పర్యటనలో కాంట్రాక్టర్ స్పష్టం చేసారు. దీంతో..ఈ రోజు జరిగే సమావేశం పోలవరం నిర్మాణానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications