తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై చేపట్టిన సీబీఐ విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం.. నెయ్యి సరఫరా చేసిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది.
తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన పరాగ్ డెయిరీ, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ సంస్థలకు సంబంధించిన కీలక వ్యక్తులను మూడు రోజులుగా తిరుపతిలోనే విచారిస్తోంది. విచారణకు సహకరించకపోవడంతోపాటు కల్తీ నెయ్యి ఘటనలో వారి ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు లభ్యం కావడంతో ఆదివారం వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, పరాగ్ డెయిరీ, ఆల్ఫా మిల్క్ ఫుడ్స్, ఏఆర్ డెయిరీకి సంబంధించిన విపిన్ గుప్తా, పోమిల్ జైన్, అపూర్వ చావడ, రాజశేఖర్‌లను అదుపులోకి తీసుకుంది. వీరిని సోమవారం కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.
కాగా, తిరుమల శ్రీవారి లడ్డు తయారీకి కల్తీ నెయ్యి వినియోగంపై సీబీఐ నేతృత్వంలో కొనసాగుతున్న దర్యాప్తు కీలక దశకు చేరింది. శ్రీవారి లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిలో జంతు కళేబరాల అవశేషాలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా మారిన వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ కోరుతూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ నేతృత్వంలో పూర్తిస్థాయి విచారణకు ప్రత్యేక బృందం ఏర్పాటైంది. సీబీఐ హైదరాబాద్ డివిజన్ జాయింట్ డైరెక్టర్ వీరేశ్ ప్రభు, విశాఖ సీబీఐ ఎస్పీ మురళీరాంబతో పాటు రాష్ట్రం నుంచి విశాఖపట్నం డీఐజీ గోపీనాథ్ జెట్టి, గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ్ త్రిపాఠి, ఎఫ్ఎస్ఎస్ఐ అధికారి సత్యకుమార్ పాండ్యా ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications