ఏపీ ఎన్నికల వేళ వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో కీలక పరిణామం!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఈ సమయంలో ఏపీలో వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పైన ప్రస్తుతం రగడ కొనసాగుతుంది. మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె వైఎస్ సునీత మరో మారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
శివశంకర్ రెడ్డి బెయిల్ పై సుప్రీం మెట్లెక్కిన సునీత
తన తండ్రిని హతమార్చిన వారికి శిక్ష పడాలని న్యాయ పోరాటం చేస్తున్న సునీత తాజాగా వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో దేవి రెడ్డి శివ శంకర్ రెడ్డి కి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

నిందితుడు శివశంకర్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్
షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు రెండు లక్షల పూచికత్తు సమర్పించాలని ఆదేశించింది.ప్రతి సోమవారం సిసిఎస్ పోలీస్ స్టేషన్ ముందు హాజరుకావాలని పేర్కొంది. ఇక ఏపీలో కి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవేశించ కూడదని కూడా హైకోర్టు షరతు విధించింది. దీంతోపాటు దేవిరెడ్డి రెడ్డి సరెండర్ చేయాలని హైకోర్టు ఆదేశించింది.
బెయిల్ రద్దు చెయ్యాలని సునీత పిటీషన్ .. ధర్మాసనం విచారణ
ఇక షరతులతో కూడిన బెయిల్ మంజూరుతో బయటకు వచ్చిన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి విషయంలో వైయస్ వివేకా కుమార్తె సునీత సుప్రీం ధర్మాసనాన్ని ఆశ్రయించారు. శివశంకర్ రెడ్డికి ఇటీవల తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ ను రద్దు చేయాలని తాజాగా ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ సంజీవ్ కన్నా ధర్మాసనం నేడు విచారణ జరిపింది.
వారికి నోటీసులు. విచారణ వాయిదా
సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. శివ శంకర్ రెడ్డితో పాటుగా ప్రతివాదులు అందరికీ సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జూలై 22వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే ఇప్పటికే వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి, యర్రా గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు.
సునీత న్యాయ పోరాటం
ఇక ఈ కేసులో దస్తగిరి అప్రూవర్ గా మారాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై ఆయన కుమార్తె సునీత అలుపెరగని న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇక తాజా ఎన్నికల్లో తన తండ్రి హత్యకేసు నిందితుడైన కడప ఎంపీగా పోటీ చేసిన వైఎస్ అవినాష్ రెడ్డిని ఓడించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.












Click it and Unblock the Notifications