వివేకా కేసులో కీలక పరిణామాలు ! చావు బతుకుల్లో ప్రత్యక్ష సాక్షి- రేపు లొంగిపోతున్న ఏ1
ఏపీలో సంచలనం రేపుతున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో వివేకా హత్య చూసిన ప్రత్యక్ష సాక్షి వాచ్ మెన్ రంగయ్య ఆరోగ్యం విషమించింది. అలాగే ఈ కేసులో ఏ1 నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దయిన నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు. రేపు ఆయన లొంగిపోనున్నారు.
వివేకా హత్య చూసిన ప్రత్యక్ష సాక్షి రంగయ్య సీబీఐకి కీలక సాక్ష్యం ఇచ్చారు. అనంతరం ఆయనపైనా ఒత్తిళ్లు పెరిగాయి. సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకోవాలనే బెదిరింపులు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. అనంతరం ఆయన ఆరోగ్యంపై ఈ ప్రభావం పడింది. చివరకు ఆయన ఆరోగ్యం విషమించడంతో తిరుపతి స్విమ్స్ ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. అనంతరం ఇవాళ హైదరాబాద్ కు తరలిస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో ఆయన్ను చేర్చే అవకాశముంది.

వివేకానందరెడ్డి హత్య జరిగిన 2019 మార్చి 15వ రోజు రాత్రి వాచ్ మెన్ రంగయ్య అక్కడే ఉన్నారు. సీబీఐ విచారణలో ఆయన జరిగిందంతా ఇప్పటికే పూసగుచ్చినట్లు చెప్పేశారు. అయితే రంగయ్య చెప్పిన విషయాల ఆధారంగానే ముందుకెళ్లే పరిస్ధితి లేకపోవడంతో ఇతర ఆధారాలపై సీబీఐ దృష్టిపెట్టింది. ఈ క్రమంలో పలువురు నిందితుల్ని అరెస్టు చేసి కేసును తుది దశకు తీసుకొచ్చింది. అయితే రంగయ్య తాను చూసింది చెప్పకపోయుంటే మాత్రం ఇప్పటికీ ఈ కేసులో సీబీఐ పురోగతి సాధించే అవకాశం ఉండేది కాదు.

మరోవైపు వివేకా హత్యను అమలు చేసిన ఏ1 నిందితుడు ఎర్ర గంగిరెడ్డి ఇన్నాళ్లు డీఫాల్ట్ బెయిల్ పై బయటే ఉన్నారు. తాజాగా సీబీఐ వ్యక్తం చేసిన అభ్యంతరాలతో తెలంగాణ హైకోర్టు ఆయన బెయిల్ రద్దు చేసింది. మే 5వ తేదీలోగా లొంగిపోవాలని, లేకుంటే ఆయన్ను అరెస్టు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో లాయర్లతో చర్చించిన ఆయన.. రేపు పోలీసుల ముందు హైదరాబాద్ లో లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు. దీంతో రంగయ్యతో పాటు ఎర్ర గంగిరెడ్డి కూడా రేపు హైదరాబాద్ లోనే ఉంటారు.












Click it and Unblock the Notifications