పాడైన ఖైరతాబాద్ గణపతి లడ్డు, సాగర్ పాలు
హైదరాబాద్: రాష్ట్రంలో ఖైరతాబాద్ వినాయకుడికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. నవ రాత్రులు ఘనంగా పూజలందుకున్న వినాయకుడి విగ్రహానికి గురువారం అత్యంత వైభవంగా నిమజ్జనం నిర్వహించారు. శుక్రవారం ఖైరతాబాద్ గణపతి దగ్గర పెట్టిన 4వేల కిలోల తాపేశ్వరం లడ్డూను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేశారు.
తొమ్మిది రోజులపాటు గణపతి విగ్రహం దగ్గరే పూజలందుకున్న లడ్డూ ప్రసాదం పాడైపోవడంతోనే హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేశారు. గణపతి లడ్డూ ప్రసాదాన్ని శుక్రవారం పంపిణీ చేస్తామని ప్రకటించడంతో అక్కడికి భక్తులు భారీగా చేరుకున్నారు. అయితే ఈ భారీ లడ్డూను పరిశీలించిన నిపుణులు వివిధ కారణాల వల్ల లడ్డూ పాడైపోయిందని తెలిపారు. లడ్డూను తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉందని చెప్పారు. దీంతో నిర్వాహకులు లడ్డూను హుస్సేన్ సాగర్‌లో వేశారు.

కాగా తొమ్మిది రోజులుగా ప్రత్యేక పూజలందుకున్న ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహాన్ని గురువారం హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేశారు. నిమజ్జన కార్యక్రమానికి వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం కోసం అధికారులు ఓ భారీ క్రేన్‌ను ట్యాంక్‌బండ్‌కు తీసుకువచ్చారు. క్రేన్ సహాయంతో భక్త జన సందోహం మధ్య శుక్రవారం 59 అడుగుల భారీ వినాయక విగ్రహ నిమజ్జన కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఇది ఇలా ఉండగా హుస్సేన్ సాగర్‌లో నగరంలో ఏర్పాటు చేసిన సుమారు 50వేల వినాయక విగ్రహాలు నిమజ్జనమయ్యాయి. నిరుడు కంటే సుమారు 15శాతం ఎక్కువగా విగ్రహాలు ఏర్పాటైనట్లు సమాచారం. వినాయక నిమజ్జన కార్యక్రమం ముగియడంతో ప్రస్తుతం అధికారులు సాగర్‌లోని విగ్రహాలను, ఇతర వ్యర్థ పదార్థాలను బయటికి తీసే ఏర్పాట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications