సంచలనం:7 కోట్ల రూపాయల స్కాంలో... ఏలూరువాసి అరెస్ట్‌

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

పశ్చిమ గోదావరి:ఆర్థిక నేరానికి పాల్పడినందుకు గాను పశ్చిమ గోదావరి జిల్లా వాసిని గోవా పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది. గోవాలోని సహారా ఇండియా బ్రాంచ్ లో క్యాషియర్‌గా విధులు నిర్వహించే సమయంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఏలూరుకు చెందిన కాజా యూసఫ్‌ షరీఫ్ అనే వ్యక్తిని సోమవారం గోవా పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే...

గోవాలోని ఆర్ధిక నేరాల దర్యాప్తు సంస్థ ఇన్‌స్పెక్టర్‌ ప్రద్యుత్‌ పడతే తెలిపిన వివరాల ప్రకారం...ఏలూరు రూరల్‌ మండలం పరిధిలోని వెంకటాపురం పంచాయతీ వినాయకనగర్‌కు చెందిన కాజా యూసఫ్‌ షరీఫ్‌(55) అనే వ్యక్తి మొదట్లో ఏలూరులోని సహారా ఇండియా బ్రాంచ్‌లో గుమస్తాగా పనిచేసేవాడు. షరీఫ్ పనితీరు బాగుండటంతో ఆయనను ఆ తరువాత కాలంలో ప్రమోషన్ మీద గోవాలోని వాస్కోడిగామా బ్రాంచ్‌కు క్యాషియర్‌గా బదిలీ చేశారు.

అయితే కాజా యూసఫ్‌ షరీఫ్ అక్కడ పనిచేస్తున్న సమయంలో స్థానికుడైన బ్రాంచ్‌ మేనేజర్‌, అదే ప్రాంతానికి చెందిన ఒక ఏజెంట్‌తో చేతులు కలిపి ఖాతాదారుల సొమ్మును స్వాహా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కస్టమర్లకు చెందిన సొమ్ము మెచ్యూరిటీ అవగానే వారికి ఆ విషయం తెలపకుండా వీరి ముగ్గురు కలసి ఆ డిపాజిట్లను డ్రా చేసుకొని స్వాహా చేసినట్లు తెలుస్తోంది.

Khaza yusaf sharif was arrested by Goa police

అలాగే మరికొన్ని డిపాజిట్లపై వీరే లోన్లు అప్లయి చేసి అలా కూడా కస్టమర్ల డబ్బు స్వాహా చేసేశారు. మరోవైపు రోజువారి కలెక్షన్‌ సొమ్మును ఖాతాలో జమ చేయకుండా తామే తీసేసుకొని ఖాతాదారులకు మాత్రం నకిలీ రశీదులు ఇచ్చేవారు. ఈ విధంగా వీరు సుదీర్ఘకాలం చేసిన దందా ఆ తరువాత బైట పడటంతో సంస్థ ఫిర్యాదు మేరకు 2013 సెప్టెంబర్‌ 22న వాస్కోడిగామా పోలీసులు ఈ ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. ఇలా...వీరు స్వాహా చేసిన మొత్తం సుమారు 7 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. ఆ ముగ్గురు ఉద్యోగులను కంపెనీ నుంచి తీసేయడంతో షరీఫ్‌ అక్కడ నుంచి తిరిగి వచ్చి మళ్లీ ఏలూరులోనే ఉంటున్నాడు.

అయితే వీరిపై నమోదైన ఈ కేసును గోవా ప్రభుత్వం ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థకు ఇవ్వడంతో ఇన్‌స్పెక్టర్‌ ప్రద్యుత్‌ పడతే పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ఇదే కేసులో నిందితులైన గోవాకు చెందిన మేనేజర్‌ను, ఏజెంట్‌ను అరెస్టు చేశారు. కేసులో రెండవ నిందితుడైన కాజా యూసఫ్‌ షరీఫ్ కోసం ఆరా తీసిన పోలీసులు సోమవారం సాయంత్రం వినాయకనగర్‌లోని అతన్నిఇంటి వద్ద అరెస్టు చేశారు. ఆ తర్వాత అతనికి ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు చేయించారు. ఆ తరువాత ట్రాన్సిట్‌ వారెంట్‌ కోసం ఏలూరులోని మొబైల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో సోమవారం సాయంత్రం హాజరుపరచగా వారెంట్‌ను జారీ చేశారు. దీంతో నిందితుడిని పోలీసులు గోవా తీసుకువెళ్లారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
West Godavri: Goa police have arrested one person following complaints of financial scams. Khaza yusaf sharif was arrested by Goa police for financial crimes while working in Sahara India.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి