Satyasai District: సత్యసాయి జిల్లాలో దారుణం.. కిడ్నాపైన బాలుడు హత్య..!
సత్యసాయి జిల్లాలో దారుణం జరిగింది. గుర్తు తెలియని దుండగులు బాలుడిని కిడ్నాప్ చేసి హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
మడకశిర మండలంలోని ఆమిదాలగొంది గ్రామానికి చెందిన చేతన్ స్థానిక ప్రభుత్వ జడ్పీ హైస్కూల్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. అతను గురువారం పాఠశాలకు వెళ్లాడు. తర్వాత ఇంటికి రాలేదు. దీంతో తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులను సంప్రదించారు. చేతన్ మధ్యలోనే వెళ్లిపోయినట్లు వారు చెప్పారు.
దీంతో చేతన్ తల్లిదండ్రులు పలు చోట్లు వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పోలీసులు ఫిర్యాదు చేశారు. పాఠశాలకు వెళ్లిన బాలుడు కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో పాఠశాల సమీపంలోని సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించారు. చేతన్ ను ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. బాలుడు కిడ్నాప్ అయ్యాడని తేల్చిన పోలీసులు అతనికి కోసం గాలింపు చేపట్టారు.

ఈ క్రమంలో శుక్రవారం మడకశిర సరిహద్దున ఉన్న కర్ణాటక పావగడ అటవీ ప్రాంతంలో బాలుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. బాలుడిని ఎందుకు కిడ్నాప్ చేశారు. హత్య చేయాల్సిన అవసరం ఏముందని పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నిందితుల కోసం పోలీస్ బృందాలు గాలింపు చేపట్టాయి. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తమకు ఎవరితో గొడవలు లేవంటూ రోదిస్తున్నారు.
విద్యార్థిని పాఠశాల నుంచి కిడ్నాప్ చేసి హత్య చేసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు త్వరగా నిందితులను పట్టుకోవాలని ఆమిదాలగొంది వాసులు డిమాండ్ చేస్తున్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో నేరాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications