దుమారం: దూరంగా శ్రీధర్‌బాబు, బెడిసికొట్టిన కిరణ్ ప్లాన్
హైదరాబాద్: మంత్రి శ్రీధర్ బాబును శాసన సభ వ్యవహారాల శాఖ నుండి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తప్పించడం తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో చర్చకు ఉన్న సమయంలో శ్రీధర్ బాబును తప్పించి ఆ బాధ్యతలను శైలజానాథ్‌కు అప్పగించడంపై తెలంగాణ ప్రాంత నేతలు మండిపడుతున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలు పార్టీలకతీతంగా దీని మీద కిరణ్ పైన గుర్రుగా ఉన్నారు.
కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, పిసిసి మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణతో సహా అందరూ కిరణ్ తీరును తప్పు పడుతున్నారు. అయితే, సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు నేతలు మాత్రం కిరణ్‌ను వెనుకేసుకొస్తున్నారు. శాఖల మార్పు ముఖ్యమంత్రి చేతిలోనే ఉంటుందని చెబుతున్నారు. దానికి తెలంగాణ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. శాఖల మార్పు ముఖ్యమంత్రి చేతిలో ఉంటుందనే విషయం తెలుసునని అయితే, ఈ సమయంలో మార్చడాన్ని తాము ప్రశ్నిస్తున్నామని చెబుతున్నారు.

తెలంగాణ ముసాయిదా బిల్లు అసెంబ్లీలో ఉన్నందునే శాసన సభ వ్యవహారాల నుండి శ్రీధర్ బాబును ముఖ్యమంత్రి తప్పించారని తెలంగాణ నేతలు మండిపడుతున్నారు. శ్రీధర్ బాబు శాఖను మార్చడం వెనుక తెలంగాణ అంశం ఉన్నప్పటికీ కొంతకాలంగా ఇరువురి మధ్య విభేదాలు ఉన్నాయి. ప్రారంభంలో శ్రీధర్ బాబు, కిరణ్ కుమార్ రెడ్డిల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. కిరణ్ ముఖ్యమంత్రి అయ్యాక కూడా శ్రీధర్ బాబుతో ఆ సంబంధాలు కొనసాగాయి.
రూపాయికి కిలో బియ్యం పథకం ప్రారంభించినప్పుడు వీరి మధ్య విభేదాలు పొడసూపాయి. పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్న తనకు మాట మాత్రం చెప్పకుండా కిరణ్ ఆ పథకాన్ని ప్రారంభించారని శ్రీధర్ బాబు బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత వారి మధ్య విభేదాలు బయటపడ్డాయి. విభజన ప్రకటన అనంతరం ముఖ్యమంత్రి సమైక్యవాదం ఎత్తుకోగా, శ్రీధర్ బాబు తెలంగాణ కోసం గట్టిగా నిలబడ్డారు. దీంతో వీరి మధ్య దూరం మరింత పెరిగింది.
సమయం, సందర్భం వచ్చినప్పుడు కిరణ్ పైన శ్రీధర్ తెలంగాణ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. అదే సమయంలో ఇటీవల శాసన సభ ప్రోరోగ్ దస్త్రం వెంటనే సంతకం చేసి ముఖ్యమంత్రికి పంపకుండా శ్రీధర్ బాబు తన వద్దే ఉంచుకున్నారు. పైగా వెంటనే పంపవలసిన అవసరం లేదని ప్రకటనలు చేశారు. నిబంధనల ప్రకారం ప్రోరోగ్ దస్త్రాన్ని పంపాలని ముఖ్యమంత్రి పిలిచి చెప్పినా శ్రీధర్ బాబు వినలేదు.
అనంతరం శాసన సభలో చిన్నపాటి డ్రామా మధ్య చర్చ ప్రారంభమైందని శ్రీధర్ బాబు చెప్పడం కూడా కిరణ్‌కు ఆగ్రహం తెప్పించింది. డిసెంబర్ 16న స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. అదే రోజు సభ వాయిదా పడి, తిరిగి సమావేశమైన తర్వాత డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టు విక్రమార్క స్పీకర్ స్థానంలో ఉండగా బిల్లుపై చర్చకు శ్రీకారం చుట్టడంపై చిన్నపాటి డ్రామా నడిచింది.
శాసనసభ వ్యవహారాల మంత్రి హోదాలో శ్రీధర్ బిల్లుపై చర్చ చేపట్టాలని కోరడం ఆ వెంటనే స్పీకర్ స్థానంలో ఉన్న విక్రమార్క విపక్షనేత చంద్రబాబు పేరు పిలవడం, ఆ వెంటనే సభను వాయిదా వేయడం జరిగిపోయింది. దీంతో బిల్లుపై చర్చ మొదలైందా? లేదా? అనే మీమాంస, వివాదం తీవ్రస్థాయిలోనే చెలరేగింది. సాంకేతికంగా చర్చ ప్రారంభమైనట్లుకాదని ఒక వర్గం చెబుతుండగానే శాసనసభ వ్యవహారాల మంత్రి హోదాలో శ్రీధర్ చర్చ మొదలైందని ప్రకటించారు. ప్రొరోగ్ వ్యవహారంతో శ్రీధర్ బాబుపై కోపంగా ఉన్న కిరణ్‌కు చర్చ వివాదం మరింత కోపం తెప్పించింది.
కిరణ్ ప్లాన్ బెడిసి కొట్టిందా?
ముఖ్యమంత్రి కిరణ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి కీలకమైన వాణిజ్య పన్నుల శాఖను తన వద్దనే ఉంచుకున్నారు. బిల్లు నేపథ్యంలో శ్రీధర్ బాబును శాసన సభ వ్యవహారాల నుండి తప్పించేందుకు తన వద్ద ఉన్న వాణిజ్య పన్నుల శాఖను ఆయనకు అప్పగించ చూశారు. ఆ శాఖ పైన పలువురు ఆసక్తి చూపినా కిరణ్ ఇప్పటి వరకు ఎవరికీ ఇవ్వలేదు. బిల్లు నేపథ్యంలో ప్రాధాన్యత గల శాసన సభ వ్యవహారాల శాఖ నుండి తప్పించారనే అసంతృప్తి ఉండకుండా చేసేందుకు కిరణ్ కీలకమైన ఆ శాఖను ఇప్పుడు శ్రీధర్‌కు ఇచ్చే ప్రయత్నాలు చేసినా అది బెడిసి కొట్టి తెలంగాణవాదుల ఆగ్రహానికి గురైందంటున్నారు.












Click it and Unblock the Notifications