కేంద్రాన్ని ఎదిరిస్తా, అందర్నీ అడుగుతా: విభజనపై కిరణ్
చిత్తూరు: కేంద్రాన్ని ఎదిరించైనా సరే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం అన్నారు. ఆయన చిత్తూరు జిల్లా కెవిపల్లి మండలంలోని జిల్లెళ్లమంద రచ్చబండలో పాల్గొన్న విషయం తెలిసిందే. కలకడలో నిర్వహించిన మూడో విడత రచ్చబండ కార్యక్రమంలోను పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిరణ్ సమైక్య గళం వినిపించారు.
తెలుగు ప్రజలు అందరూ కలిసే ఉండాలని, అలా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని, రాష్ట్రం పెద్దగా ఉండే నిధులు ఎక్కువగా వస్తాయని కిరణ్ అన్నారు. రెండుగా విడిపోతే అన్ని ప్రాంతాలకు నష్టమే అన్నారు. సమైక్య రాష్ట్రం కోసం కేంద్రాన్ని కూడా ఎదిరిస్తానని చెప్పారు. కొన్ని దురదృష్టకర పరిస్థితుల నేపథ్యంలో ప్రజలపై విభజన ఆటంబాంబు పడిందన్నారు. దీనిని జాగ్రత్తగా తొలగించుకోవాలన్నారు.

అందరూ కలిసుండేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తానని చెప్పారు. కేంద్రానికి ఇప్పటికే తన అభిప్రాయాలు వెల్లడించానని, అధిష్టానంతో మాట్లాడుతున్నానని చెప్పారు. విభజన జరగకుండా అధిష్టాన్ని ఒప్పిస్తానని చెప్పారు. తగిన సమయం వచ్చినప్పుడు అందర్నీ పేరుపేరునా కోరుతానని, అందరూ మద్దతివ్వాలన్నారు.
బిడికి దేవాలయంలో ఐదుగురు దేవతలు కొలువై ఉంటారని, అక్కడి గుళ్లో కోరుకున్న కోరిక నెరవేరుతుందని, రాష్ట్రం సమైక్యంగా ఉండాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. సమైక్యం విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదన్నారు.












Click it and Unblock the Notifications