కిరణ్‌కు కట్ 5 నిమిషాల పని, నైట్ వాచ్‌మన్: హరీష్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇంటికి విద్యుత్‌ను కట్ చేయడం ఐదు నిమిషాల పని అని కానీ, తాము అలాంటి పని చేయమని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసన సభ్యుడు హరీష్ రావు మంగళవారం అన్నారు. విద్యుత్ కోతపై ఆయన మండిపడ్డారు. హైదరాబాదులో పుట్టినంత మాత్రాన ముఖ్యమంత్రి తెలంగాణ వ్యక్తి అయిపోడన్నారు. కిరణ్‌ది సమైక్య విత్తనమే అన్నారు. సిఎం సీటులో నైట్ వాచ్‌మన్‌గా ఆయన వచ్చారని ఎద్దేవా చేశారు.
సీమాంధ్ర ఉద్యమానికి కిరణ్ కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. సిడబ్ల్యూసి ప్రకటన చేసిన ఇప్పటికి 45 రోజులైనా కేంద్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని, తమ ఓపికను చేతకానితనంగా తీసుకోవద్దన్నారు. ఇలాగే వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలుంటాయన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చినా ప్రపంచంలో స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోలేని దురదృష్టవంతులు తెలంగాణ ప్రజలు అని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణకు ఒక్క పైసా కూడా ఇవ్వనని కిరణ్ అసెంబ్లీ సాక్షిగా చెప్పినా తెలంగాణ మంత్రులు స్పందించలేదని, వారు దద్దమ్మలు అని తెరాస ప్రధాన కార్యదర్శి కె కేశవ రావు అన్నారు. హైదరాబాదులో అన్ని వ్యాపారాలు సీమాంధ్రుల చేతుల్లో కేంద్రీకృతమయ్యాయని ఆరోపించారు. షాపింగ్ మాల్స్, ఆపార్టుమెంట్స్ అన్నీ సీమాంధ్రుల చేతుల్లోనే ఉన్నాయన్నారు. హైదరాబాదులోని భూములను అన్యాక్రాంతం చేశారన్నారు.
తాము విడిపోతామన్నా కలిసుండాలని సీమాంధ్రులు పట్టుబట్టడం ఎంత వరకు సమంజసమన్నారు. తెలంగాణ కాంగ్రెసు నేతలు అస్తిత్వం కోసం ప్రయత్నిస్తున్నారన్నారు. తెలంగాణ విషయంలో కాంగ్రెసు పార్టీ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉన్నా మళ్లీ ఉద్యమం తప్పదని వరంగల్ జిల్లాలో తెరాస నేత వినోద్ కుమార్ అన్నారు.












Click it and Unblock the Notifications