టీ తీర్మానం ఓడిద్దాం, కలసే రాజీనామాలు: కిరణ్ రెడ్డి

సీమాంధ్ర మంత్రులు ఏరాసు ప్రతాప్ రెడ్డి, టిజి వెంకటేశ్, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డిలతో కిరణ్ కుమార్ రెడ్డి ఆ విధంగా అన్నట్లు తెలుస్తోంది. క్యాంపు కార్యాలయంలో ఆదివారం ముఖ్యమంత్రిని ఏరాసు, టిజి వెంకటేష్, జెసి దివాకర్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా రాజీనామాలు చేయాలని పార్లమెంటు సభ్యులు తీసుకున్న నిర్ణయంపై చర్చ జరిగింది. ఎంపీల నిర్ణయంతో సీమాంధ్రకు చెందిన మిగిలిన ప్రజా ప్రతినిధులందరిపైనా ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సీమాంధ్ర ప్రజా ప్రతినిధులంతా రాజీనామాలు చేయక తప్పని పరిస్థితి నెలకొంటుందని వివరించారు.
రాజీనామాలు చేస్తే రాష్ట్ర విభజన తీర్మానం అసెంబ్లీకి వచ్చినప్పుడు, కేబినెట్ నోట్ మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చినప్పుడు, విభజన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినప్పుడు అంతా ఏకపక్షంగా సాగుతుందని వారు అభిప్రాయపడ్డారు. అలా ఏకపక్షంగా జరిగే అవకాశం కల్పించకూడదని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. పార్లమెంట్‌లో బిల్లును సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు అడ్డుకుంటే చిన్న రాష్ట్రాల ఏర్పాటును వ్యతిరేకిస్తున్న సమాజ్‌వాదీ, తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలు కూడా అండగా నిలిచి తమ వాదనను గట్టిగా వినిపించే అవకాశం ఉందని వివరించారు.
మంత్రివర్గం ముందుకు నోట్ వచ్చినప్పుడు సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు దానిపై అభ్యంతరాలు లేవనెత్తుతూ వారి వాదనలు వినిపించే వీలుంటుందని స్పష్టం చేశారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ప్రభుత్వాలు పడిపోతాయన్న భయం లేకపోవడంతో పార్టీ అధిష్టానం రాజీనామాలు చేస్తే చేసుకోండనే పద్ధతిలో వ్యవహరిస్తోందని అభిప్రాయపడ్డారు. ఎంపీలు రాజీనామాలు చేస్తే తాము కూడా చేయాల్సి వస్తుందని, వాటిని తక్షణమే ఆమోదించుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుందని ముఖ్యమంత్రికి మంత్రులు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications