అవతరణ: అయోమయమని కిరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్: రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దివంగత ప్రధాని ఇందిరా గాంధీ చేసిన ప్రసంగాన్ని చదివి వినిపించారు. విశాలాంధ్ర నినాదం తన చెవుల్లో మార్మోగుతోందని, తాను సమైక్యవాదినని ఇందిర గతంలో పార్లమెంటులో చెప్పారని ఆయన గుర్తు చేశారు.
మళ్లీ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటామో లేదోనని ప్రజలు అయోమయంలో ఉన్నారని అన్నారు. సమైక్య రాష్ట్రంలోనే సంపూర్ణ అభివృద్ధి అన్నారు. తెలుగు జాతి ఒక్కటిగా ఉండటం వల్లనే రాజకీయంగా మనకు విలువ ఉందని చెప్పారు. పూర్వీకులు మనకు అందించిన సంస్కృతి, సంప్రదాయాలు తదితరాలను మనం మన ముందు తరాలకు అందించాలని, అది మన కనీస కర్తవ్యమన్నారు.

రాష్ట్ర అవతరణ మళ్లీ జరుపుకుంటామో లేదోనని ప్రజలు అనిశ్చితిలో ఉన్నారని ముఖ్యమంత్రి ఈ ఉత్సవం ప్రతియేటా ఇలాగే కొనసాగాలని తాను ప్రార్థిస్తున్నానని చెప్పారు. తెలుగు మాట్లాడే వారందరి కోసం శ్రీ పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారని, బూర్గుల రామకృష్ణ రావు పదవీ త్యాగం చేశారని అన్నారు. తెలుగు వారు ఉన్నత శిఖరాలకు ఎదిగి భారత దేశానికి దశ దిశ చూపిన సంజీవ రెడ్డి, పివి నరసింహ రావు వంటి వారికి జోహార్లు అన్నారు.
బలమైన రాష్ట్రం వల్లనే శాంతిభద్రతలు, సుస్థిరత అన్నారు. అందరం ఒక్కటిగా ఉండటం వల్లనే శ్రీశైలం, నాగార్జున సాగర్ వంటి ప్రాజెక్టులు కట్టామన్నారు. రాజకీయ విజ్ఞత ఉన్నత వారిని ఎన్నుకోవాలన్నారు. కులం, మతం, ప్రాంతం అనే బేధం లేకుండా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు రూపొందిస్తుందన్నారు.












Click it and Unblock the Notifications