ట్విస్ట్: తెలంగాణ బిల్లుపై కిరణ్ మెలిక, జగన్‌కు కౌంటర్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ముసాయిదా బిల్లు పైన కొత్త ట్విస్ట్ ఇచ్చారు. గురువారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో పిచ్చాపాటిగా మాట్లాడారు. విభజన బిల్లును ఇంకా అసెంబ్లీలో ప్రవేశ పెట్టలేదన్నారు. అర్థం లేని బిల్లు పైన చర్చ వ్యర్థమన్నారు. అలాగే బిల్లు పైన చర్చకు ప్రత్యేక పద్ధతిని నిర్ణయించలేదని చెప్పారు. విభజన బిల్లులో సమగ్రత లేదని ప్రతిపక్షాలు చెబుతున్నాయని ఆయన మెలిక పెట్టారు.
ఈ నేపథ్యంలో తాను విభజన పైన పూర్తి సమాచారమివ్వాలని కేంద్రానికి లేఖ రాయనున్నట్లు చెప్పారు. తాను సమైక్యాంధ్ర కోసం పోరాటాన్ని విరమించలేదని చెప్పారు. విభజనపై ఏం జరుగుతుందో అందరు చూస్తారన్నారు. అదే సమయంలో తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన వారు, కేంద్రంపై భారం వేసిన వారు తనను విమర్శించడమేమిటని తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలను ఉద్దేశించి అన్నారు.

బిల్లుపై వివిధ పక్షాలు కోరిన సమాచారం మేరకు రాష్ట్రం కేంద్రానికి లేఖ రాస్తుందని చెప్పారు. బిల్లుపై చర్చ ఎలా సాగాలన్నది.. అసెంబ్లీ, మండలి సభాపతులే నిర్ణయించాలన్నారు. తాను పోరాటయోధుడినని, చివరిదాకా పోరాడుతానని చెప్పారు. రాష్ట్రం కలిసి ఉండాలో లేదో శాసన సభ, మండలిలే తేల్చి చెప్పాలని ట్విస్ట్ ఇచ్చారు. సభలో ఇరు ప్రాంతాలను మెప్పించే విధంగా చర్చ జరగాలని ఆకాంక్షించారు.
కాగా, బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పుపై ముఖ్యమంత్రి నేతృత్వంలో అఖిల పక్షం ఢిల్లీకి వెళ్లనుంది. రాత్రి పదకొండు గంటలకు వారు ఢిల్లీకి చేరుకుంటారు. బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పులో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వారు శుక్రవారం ఉదయం పదిగంటలకు ప్రధానితో భేటీ అయి వివరించనున్నారు.
అఖిల పక్షంలో ప్రభుత్వం తరఫున కిరణ్, సుదర్శన్ రెడ్డి, కాంగ్రెసు పార్టీ తరఫున బొత్స సత్యనారాయణ, జానా రెడ్డి, పార్థసారథి, టిడిపి నుండి కోడెల శివ ప్రసాద్, బిజెపి నుండి నాగం జనార్ధన్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుండి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తెరాస నుండి వినోద్ కుమార్, మజిల్స్ నుండి అసదుద్దీన్, సిపిఐ నుండి నారాయణ, సిపిఎం నుండి రాఘవులు, లోక్‌సత్తా నుండి రామారావులు ఉన్నారు.












Click it and Unblock the Notifications