శ్రీధర్ Vs కిరణ్: కరీంనగర్ బంద్, బజారు రౌడీలా.. ఈటెల
హైదరాబాద్/వరంగల్/కరీంనగర్: మంత్రి శ్రీధర్ బాబును శాసన సభ వ్యవహారాల మంత్రిగా తొలగించి, ఆ బాధ్యతలను శైలజానాథ్‌కు అప్పగించిన నేపథ్యంలో తెలంగాణవాదులు, తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన మండిపడుతున్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడారు. వాణిజ్య పన్నుల శాఖ బాధ్యతలను తాను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోనని, అధిష్టానం పెద్దలతో చర్చించిన అనంతరం తాను స్పందిస్తానని చెప్పారు. కిరణ్ నిర్ణయంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
కట్టడి చేయండి: గండ్ర
కిరణ్ పైన ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి వరంగల్ జిల్లాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కిరణ్ తీరు నోట్లో స్వీటు పెట్టి కళ్లలో కారం చల్లినట్లుగా ఉందన్నారు. తెలంగాణ ప్రజలను బాధించేలా ఆయన వ్యవహార శైలి ఉందన్నారు. శ్రీధర్ బాబుకు శాసన సభ వ్యవహారాల శాఖనే కేటాయించాలన్నారు. ముఖ్యమంత్రిని కట్టడి చేయాల్సిన బాధ్యత అధిష్టానానిదే అన్నారు.

బజారు రౌడీలా: ఈటెల
కిరణ్ కుమార్ రెడ్డి బజారు రౌడీలా వ్యవహరిస్తున్నారని తెరాస శాసన సభా పక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. శ్రీధర్ బాబు మార్పు సరికాదన్నారు. కిరణ్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకోవాలన్నారు.
కరీంనగర్ బంద్
శ్రీధర్ బాబును శాసన సభ వ్యవహారాల నుండి తప్పించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణవాదులు ఆయన సొంత జిల్లా కరీంనగర్ బందుకు పిలుపునిచ్చారు. కరీంనగర్ ఆర్టీసి బస్టాండు వద్ద పలువురు కాంగ్రెసు నేతలు ధర్నాలో పాల్గొన్నారు. శ్రీధర్ బాబు శాఖను మార్చడం సరికాదని వారు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.












Click it and Unblock the Notifications