కిరణ్ దారికొస్తారు! ఉమ్మడికి సవరణ అవసరంలేదు: డిగ్గీ
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తారని, రాజ్యాంగ పరిధికి లోబడే హైదరాబాదును ఉమ్మడి రాజధానిని చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు, జివోఎం సభ్యులు దిగ్విజయ్ సింగ్ బుధవారం అన్నారు. ఆయన న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.
మంత్రుల బృందం (జివోఎం) అన్ని అంశాలని పరిశీలిస్తుందని చెప్పారు. తెలంగాణపై సిడబ్ల్యూసి తీసుకున్న నిర్ణయానికి కాంగ్రెసు పార్టీ కట్టుబడి ఉందన్నారు. త్వరలో కేబినెట్ ముందుకు జివోఎం నివేదిక వస్తుందని చెప్పారు. త్వరలో అసెంబ్లీకి తెలంగాణ బిల్లును పంపిస్తామని చెప్పారు. ఈ రోజు జివోఎం నివేదిక పూర్తవుతుందన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన అభిప్రాయాలను చెప్పడంలో ఎలాంటి తప్పు లేదన్నారు. అధిష్టానం నిర్ణయాన్ని ఆయన గౌరవిస్తారని ఆకాంక్షించారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి విధేయుడన్నారు.
రాజ్యాంగాన్ని అనుసరించే ఉమ్మడి రాజధానిని ఏర్పాటు చేస్తామన్నారు. ఉమ్మడి రాజధాని కోసం రాజ్యాంగ సవరణ అవసరం లేదని చెప్పారు. ఉమ్మడి రాజధాని ఏర్పాటు చేసే వెసులుబాటు రాజ్యాంగంలో ఉందని తెలిపారు. ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయన్నారు. అధిష్టానాన్ని ధిక్కరించేలా మాట్లాడిన వారిపై పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు కదా! అని విలేకరులు ప్రశ్నించగా.. తాను మాట్లాడతానని చెప్పారు.












Click it and Unblock the Notifications