ప్రకటన: కిరణ్ పార్టీ జై సమైక్యాంధ్ర, ఆత్మగౌరవ నినాదం
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పార్టీ పేరును ప్రకటించారు. తన పార్టీ జై సమైక్యాంధ్ర అని ఆయన చెప్పారు. తెలుగువారి ఆత్మగౌరవం నినాదంగా ఉంటుందని ఆయన చెప్పారు. సోమవారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన తన పార్టీ పేరును ప్రకటించారు. సమైక్యాంధ్ర కోసం పనిచేసిన మహిళలు, విద్యార్థులు, జెఎసి కార్యకర్తలు తమతో కలిసి రావాలని ఆయన కోరారు. ఆత్మగౌరవంతో ఓటు వేయాలనుకునేవారికే తమ పార్టీ అని ఆయన అన్నారు.
కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ తనతో మాట్లాడారని, పార్టీ పెట్టవద్దని సూచించారని, తాను పార్టీలో ఉన్నప్పుడే కాంగ్రెసు పెద్దల మాట వినలేదని, పార్టీలో లేనప్పుడు ఎలా వింటానని అనుకున్నారని కిరణ్ రెడ్డి అన్నారు. విభజనను విభేదించే తాను రాజీనామా చేశానని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర విభజన వల్ల సంభవించే లాభనష్టాలను సరిగా అంచనా వేయలేదని ఆయన విమర్శించారు.

తెలంగాణలో పంపు సెట్లు ఎక్కువగా ఉన్నాయని, విద్యుత్తుకు ఇబ్బందులు వస్తాయని, తెలంగాణ రైతులు నష్టపోతారని ఆయన అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు చాలా నష్టం ఏర్పడుతుందని ఆయన అన్నారు. విభజన వల్ల నీటి యుద్ధాలు వస్తాయని చెప్పానని ఆయన గుర్తు చేశఆరు. రాష్టర్ విభజన ప్రక్రియలో కేంద్రం హోం వర్క్ కూడా చేయలేదని ఆయన అన్నారు. తెలుగువారికి ఇంత భారీ నష్టం జరిగిన తర్వాత కూడా కాంగ్రెసు పెద్దల మాట వినాలంటే కష్టమని ఆయన అన్నారు.
కాంగ్రెసు, బిజెపి కలిసి తెలుగువారికి ద్రోహం చేశాయని ఆయన విమర్శించారు. రాష్ట్ర విభజనకు ముఖ్య కారకుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడని, తెలుగు ప్రజలకు ద్రోహం చేశారని, చంద్రబాబు వైఖరి ఏమిటో ఇప్పటి వరకు అర్థం కాలేదని, తెలుగు ప్రజలు కలిసి ఉండాలి సమైక్యాంధ్ర కోసం ఉన్నానని చెప్పలేని పిరికితనంతో చంద్రబాబు శానససభలో వ్యవహరించారని, అటువంటి వ్యక్తితో కలిసి పనిచేయాలంటే అవమానమని ఆయన అన్నారు.
తెలుగు ప్రజలకు కాంగ్రెసు, బిజెపి, వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం తీవ్ర అన్యాయం చేశాయని ఆయన అన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పార్టీ అవసరమని పెడుతున్నామని ఆయన చెప్పారు. కలిసి ఉండాలనే ఉద్యమం తెలంగాణలో త్వరలోనే వస్తుందని, తాను చెప్పిన మాటను నోట్ చేసుకోవాలని ఆయన అన్నారు. తెలుగు ప్రజలంతా కలిసి ఉండాలనేదే తమ పార్టీ సిద్ధాంతమని ఆయన అన్నారు. మీడియా సమావేశంలో సబ్బం హరి, లగడపాటి రాజగోపాల్ పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications