టీ బిల్లు: జగన్‌కు కిరణ్ రెడ్డి అక్షింతలు, బాబుకు వినతి
హైదరాబాద్: విభజన బిల్లుపై శానససభలో చర్చ విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు అక్షింతలు వేస్తూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేశారు. ముసాయిదా బిల్లుపై సభలో అభిప్రాయం చెప్పే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు విజ్ఝప్తి చేశారు. ఆయన బుధవారం సాయంత్రం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సమైక్యాంధ్రపై చిత్తశుద్ధి చాటుకోవాలనుకుంటే సభలో చర్చించాలని ఆయన అన్నారు.
బిల్లుపై చర్చకు అంగీకరించారంటే విభజనకు అంగీకరించినట్లేనని జగన్ అనడంపై ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. మీరు ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర విభజన చేయాలని చెప్పారని, విభజన చేయడానికి మీరు అంగీకరించారని, ఇప్పుడు సభలో చర్చించడానికి ఎందుకు వెనకాడుతున్నారని, రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటే సభలో అభిప్రాయం చెప్పాలని ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలను ఉద్దేశించి అన్నారు. ఎన్ని సార్లు విభజనపై మీరు వైఖరి మార్చుకున్నారు, ఇప్పుడేం చెప్తారో చెప్పండని ఆయన అన్నారు.

ఎపిఎన్జీవోల ఎన్నికల్లో కూడా చేయి పెట్టి వైయస్ జగన్ కాల్చుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సమైక్యాంధ్ర కోసం పోరాటం చేస్తున్నారు కాబట్టే ఓడించాలని చూశారా అని ఆయన అడిగారు. ఎపిఎన్జీవోల అధ్యక్షుడిగా పి. అశోక్ బాబును ఓడించడానికి వైయస్ జగన్ పార్టీ ప్రయత్నించిందనే ధ్వనిని వినిపిస్తూ ఆయన ఆ విధంగా అన్నారు. రాష్ట్రాన్ని విభజించాలని తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు, బిజెపి, సిపిఐ చెప్పిన తర్వాతనే చివరగా కాంగ్రెసు పార్టీ తన నిర్ణయాన్ని ప్రకటించిందని ఆయన చెప్పారు.
కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న తమ పార్టీ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని ఆయన చెప్పారు. జాతీయ పార్టీ అయిన తమ పార్టీ తీరసుకున్న నిర్ణయాన్ని సాధారణంగా తామంతా శిరసా వహిస్తామని, అయితే కాంగ్రెసు సీమాంధ్ర నాయకులమంతా విభజన నిర్ణయాన్ని వ్యతిరేకించామని ఆయన అన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని ఆయన చెప్పారు. తనతో పాటు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు.
తమ రాజకీయ భవిష్యత్తును ఫణంగా పెట్టి తమ భవిష్యత్తు గురించి ఆలోచించకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ ఇబ్బందులు వస్తాయని, రైతులూ ఉద్యోగులూ యువతకూ ఇబ్బందులు వస్తాయని విభజనకు వ్యతిరేకంగా తాము పోరాటం చేస్తున్నామని ఆయన చెప్పుకున్నారు. కలిసి ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. ముసాయిదా బిల్లుపై శాసనసభ, శాసనమండలి అభిప్రాయాలతో పాటు శానససభ్యులు, ఎమ్మెల్సీలు వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పాల్సిన గురుతర బాధ్యత ఉందని ఆయన అన్నారు.
ప్రజాభిప్రాయం మేరకు మన అభిప్రాయాన్ని వెల్లడించడానికి ముసాయిదా బిల్లు ద్వారా అవకాశం లభించిందని, అభిప్రాయం కచ్చితంగా చెప్పాలని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర తన నినాదం కాదనీ విదానమని, శాసనసభలో కూడా అదే విషయం చెప్తామని ఆయన అన్నారు. కేంద్రంపై, తమ పార్టీపై పోరాటం చేస్తూ అసెంబ్లీలో కూడా తమ అభిప్రాయాన్ని చెప్పేందుకు సిద్ధపడ్డామని, ఇటువంటి స్థితిలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు తమ అభిప్రాయాలను వెల్లడించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
వివిధ ప్రాంతాలవారికి వివిధ అభిప్రాయాలున్నప్పుడు శాసనసభ అభిప్రాయాలకు ప్రాముఖ్యం ఉంటుందని, దానిపై ఆధారపడి రాష్ట్రపతి, పార్లమెంటు నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంటుందని, ఇంతకు ముందు ఏ అభిప్రాయం చెప్పినా సరే శానససభలో చెప్పే అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటారని ఆయన అన్నారు. అభిప్రాయాలు చెప్పకుండా తిరిగి పంపించి వేస్తే ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా ఫలితం వచ్చే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. చర్చ చేయకపోతే బిల్లును అంగీకరించినట్లవుతుందని ఆయన అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే చిత్తశుద్ధి ఉంటే వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు చర్చకు సహకరించాలని ఆయన అన్నారు.
తమది జాతీయ పార్టీ అని, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసులు రాష్ట్ర పార్టీలని, ఆ పార్టీల్లో చంద్రబాబు, జగన్ ఏకఛత్రాధిపతులను, వారి నిర్ణయమే పార్టీల నిర్ణయం అవుతుందని, రాష్ట్ర విభజనపై వారు వివిధ సందర్భాల్లో వైఖరిని మార్చుకున్నారని, శాసనసభలో అభిప్రాయాలు చెప్పడానికి వారికి అవకాశం వచ్చిందని, దాన్ని వాడుకోవాలని ఆయన అన్నారు. శాసనసభ భిన్నాభిప్రాయం వ్యక్తం చేసినప్పుడు రాష్ట్ర విభజన జరిగిన సందర్భాలు లేవని, ఏకాభిప్రాయంతోనే రాష్ట్రాల విభజనలు జరిగాయని ఆయన అన్నారు.
తన అధికారాలు తనకు తెలుసునని, తన అభిప్రాయాన్ని శాసనసభలో చెప్పిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని ఆయన అన్నారు. బిల్లు గురించి సభలోనే మాట్లాడుతానని, ఇక్కడ మాట్లాడబోనని ఆయన అన్నారు. నేను ఏం చెప్తానో సభలో చూస్తారు కదా అని మీడియా ప్రతినిధులను ఉద్దేశించి అన్నారు. చర్చ రెండు మూడు రోజుల్లో అయిపోతే ఫరవా లేదు, లేదంటే ఏం చేయాలో ఆలోచిస్తామని కిరణ్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications