కేసుల జగన్, విభజన బాబును నమ్మొద్దు: కిరణ్ ఫైర్
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం చిత్తూరు జిల్లా పుంగనూరులో రోడ్ నిర్వహించిన ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి రాకముందు జగన్‌పై రూ. వేల కోట్ల కుంభకోణాలకు సంబంధించి కేసులున్నాయని ఆరోపించారు. రాష్ట్ర విభజనకు చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డిలే కారణమని దుయ్యబట్టారు.
రాష్ట్ర విభజన చేయాలని చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డిలు కేంద్రానికి లేఖలు రాశారని గుర్తు చేశారు. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర విభజనకు కారకులైన జగన్మోహన్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ, టిడిపిలు వస్తున్నాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. తెలుగుతల్లిని చంపిన వారికి ఓటేస్తారా లేక సమైక్య రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి పదవిని వదిలేసిన తమ పార్టీకి ఓటేస్తారో ప్రజలు ఆలోచించుకోవాలని అన్నారు.

తాను ముఖ్యమంత్రి పదవి వదిలేసిన తర్వాత ఆ పదవి కోసం చాలా మంది చెప్పులు అరిగేలా తిరిగారని అన్నారు. తన ఆధీనంలో ఉన్న సీమాంధ్ర ప్రాంతాన్ని హైదరాబాద్ నిజాం తన పాలనా కాలంలో బ్రిటీషువారికి ఇచ్చేశారని చెప్పారు. విభజన చేసి ఏకపక్షంగా హైదరాబాద్‌ను తెలంగాణకు ఇచ్చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. హైదరాబాద్‌తో 400 ఏళ్ల నుంచి సీమాంధ్ర ప్రజలకు అనుబంధం ఉందని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి తప్పుచేశామని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేసినప్పటికీ పార్లమెంటు విభజన బిల్లును కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించిందని అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసమే తాను సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినట్లు తెలిపారు. సుప్రీం కోర్టు పిటిషన్ కొట్టే మనల్ని ఎవరూ రక్షించలేరని అన్నారు. తన కోసం ఏది చేసుకోలేదని చెప్పారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చిత్తూరు జిల్లాకు నీరు అందించేందుకు రూ. 7వేల కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. దీంతో మరో 50ఏళ్ల వరకు జిల్లాకు నీటి సమస్య ఉండదని అన్నారు.












Click it and Unblock the Notifications