టీ బిల్లును పూర్తిగా వ్యతిరేకిద్దాం: కిరణ్ రెడ్డి సూచన
హైదరాబాద్: శాసనసభలో తెలంగాణ ముసాయిదా బిల్లును పూర్తి స్థాయిలో వ్యతిరేకిద్దామని, ప్రతి క్లాజూనూ వ్యతిరేకిద్దామని, ప్రతి క్లాజుపై ఓటింగు కోరుదామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర మంత్రులు, శాసనసభ్యులతో అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కలిసికట్టుగా పోరాడదామని, ప్రజా కోర్టుగా భావించే చట్టసభల్లో తేల్చుకుందామని ఆయన అన్నారు. అవసరమైతే రాజ్యాంగ పరంగానూ న్యాయపరంగానూ పోరాటం చేద్దామని ఆయన అన్నారు.
క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన సీమాంధ్ర నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మం త్రులు ఆనం రామనారాయణ రెడ్డి, రఘువీరా రెడ్డి, పితాని సత్యనారాయణ, గంటా శ్రీనివాసరావు, పార్థసారథి, తోట నరసింహం, టీజీ వెంకటేశ్, కాసు కృష్ణా రెడ్డి, ఏరాసు ప్రతాప రెడ్డి, కోండ్రు మురళీ మోహన్, గల్లా అరుణ కుమారి, శైలజానాథ్, వట్టి వసంతకుమార్, కన్నా లక్ష్మీనారాయణ, మాజీ మంత్రులు గాదె వెంకటరెడ్డి, జేసీ దివాకర రెడ్డి సహా 50 మంది వరకూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

బుధవారం బిల్లుపై చర్చ జరిగే అవకాశం ఉందంటూనే కాంగ్రెస్ తరఫున మాట్లాడేందుకు సిద్ధంగా ఉండాలని మంత్రి వట్టి వసంత కుమార్, విప్ ద్రోణంరాజు శ్రీనివాస్‌లకు సూచించారు. చర్చ జరుగుతున్న సమయంలో సీమాంధ్ర సభ్యులంతా విధిగా హాజరు కావాలని సూచించారు. ప్రతి ఒక్కరూ కనీసం రెండు గంటలపాటు రాష్ట్ర విభజన వల్ల జరిగే నష్టాలను వివరించాలని సూచించారు.
సవరణలు కోరదాం. వాటి ద్వారా నిరసన తెలియజేద్దామని, తద్వారా విభజన బిల్లు వీగేలా చేద్దామని, అన్ని పార్టీలకూ చెందిన సీమాంధ్రలోని 159 మంది శాసనసభ్యులూ మూడు సెట్ల అఫిడవిట్లను సిద్ధం చేద్దామని ముఖ్యమంత్రి సూచించారు. ఒక సెట్‌ను రాష్ట్రపతికి, ఒక సెట్‌ను ఇప్పటికే సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్న పిల్‌కు సపోర్టుగానూ.. మరో సెట్‌ను స్పీకర్‌కు అందిద్దామని, రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications