ఈ పరిస్థితి శత్రువుకు కూడా రావొద్దు: విభజనపై సిఎం
హైదరాబాద్: విభజన వల్ల వచ్చే నష్టాలపై బయటకు చాలా కొద్దిగానే చెప్పానని, తాను సోనియాకు, ప్రధాని మన్మోహన్ సింగ్‌కు చాలా చెప్పానని, వాటినే బయటకు చెప్పానని, వారికి చెప్పిన విషయాల్లో కేవలం 25 నుంచి 30 శాతం మాత్రమే బయటకు చెప్పానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పి ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు కదా అని మీడియా ప్రతినిధులు అంటే అధిష్టానం నిర్ణయాన్ని మార్చడానికి తాను ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. పార్టీయా, సమైక్యమా అని నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి శత్రువుకు కూడా రావద్దని, ఏడాదిన్నరగా విభజన వల్ల సంభవించే నష్టాల గురించి అధిష్టానానికి చెబుతున్నానని, ప్రజలకు తెలియాలని ఇప్పుడు బయటకు చెబుతున్నానని ముఖ్యమంత్రి అన్నారు.
నిర్ణయం వల్ల మేలు జరగాలి తప్ప దాని వల్ల ఎక్కువ సమస్యలు వస్తాయని భావించినప్పుడు ఆలోచన చేయాలని ఆయన అన్నారు. విభజన వల్ల ఎక్కువ సమస్యలు వస్తాయని, వాటిని పరిష్కరించడం సాధ్యం కాకపోవచ్చునని ఇందిరా గాంధీ చెప్పారని, ఆ మాటలనే తాను అధిష్టానానికి చెప్పానని ఆయన అన్నారు. విభజన వల్ల సంభవించే పరిణామాలను తాను అధిష్టానానికి చెప్పినట్లు తెలిపారు.

బిల్లు ఎప్పుడు వస్తుందో తెలియదు
విభజన వల్ల ఇరు ప్రాంతాల ప్రజలకు నష్టం వస్తుందని చెప్పానని, తాను వ్యక్తిగతంగా మాట్లాడడం లేదని, అన్నీ ఆలోచించే మాట్లాడుతున్నానని ఆయన చెప్పారు. తన మాటల్లో స్వార్థం లేదని ఆయన అన్నారు. తెలంగాణకు ఎంతో మేలు చేశామని, ప్రభుత్వ కార్యక్రమాల వల్ల తెలంగాణకే ఎక్కువ మేలు జరిగిందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు 14ఎఫ్ తొలగింపు కోసం ఆందోళన చేశారని చేశారని, దాన్ని తొలగించామని ఆయన అన్నారు. శాసనసభకు బిల్లు ఎప్పుడు వస్తుందో తనకు తెలియదని ఆయన అన్నారు.
అసెంబ్లీని ప్రోరోగ్ చేయాలనే సూచనలో ఎటువంటి రాజకీయం లేదని ఆయన చెప్పారు. వాస్తవాలను, పరిస్థితులను తాను అధిష్టానానికి వివరించినట్లు ఆయన తెలిపారు. అసెంబ్లీ ప్రోరోగ్ ఓ సాంకేతిక విషయమని, దానికి అంతగా ప్రాధాన్యం లేదని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో తాను చేసేది రోజూ చూస్తూనే ఉన్నారు కదా, ఇంకా చెప్పేదేం ఉందని ఆయన ఎదురు ప్రశ్న వేశారు.

సవాళ్లు ఎదుర్కున్నా..
సవాళ్లు ఎదురైనా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందించినట్లు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా మూడేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సోమవారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. మూడేళ్ల పాటు తనను ఆదరించిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. దేశంలో పెద్ద యెత్తున మీ సేవా కార్యక్రమాన్ని చేపట్టామని, దాన్ని 192 సర్వీసులకు విస్తరించామని, మీ సేవా కార్యక్రమం ద్వారా రోజుకు సరాసరి లక్ష లావాదేవీలు జరుగుతన్నాయని ఆయన చెప్పారు.
తన హయాంలో చేపట్టిన కార్యక్రమాలను, అందించిన సేవలను ఆయన వివరించారు. ఇబ్బందికరమైన పరిస్థితిలో తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టానని, వాటిని సవాల్‌గా స్వీకరించానని ఆయన చెప్పారు. ఆర్థికపరమైన ఇబ్బందులతో పాటు ఆందోళనలకు సంబంధించిన ఇబ్బందులు ఎదురయ్యాయని ఆయన చెప్పారు. అయితే, సవాళ్లను ఎదుర్కుని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అందించానని ఆయన చెప్పారు.

రాజకీయ సంక్షోభాలు ఉంటే మీడియా దృష్టి అభివృద్ధి కార్యక్రమాలపై పడదని, తాను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి సరిగా వెళ్లలేదని ఆయన అన్నారు. చిన్న వయస్సులోనే ముఖ్యమంత్రిని కావడం గర్వకారణంగా ఉందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నానని ఆయన చెప్పారు. ఎస్సీఎస్టీల కోసం చారిత్రకమైన చట్టం తెచ్చామని ఆయన చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకున్నామని ఆయన చెప్పారు.
విద్యుత్తు సమస్య తీవ్రంగా వచ్చి పడిందని, అయితే వర్షాలు పడడం వల్ల దాన్ని అధిగమించామని ఆయన చెప్పారు. అయితే కేంద్రం నుంచి రావాల్సిన గ్యాస్ మాత్రం ఇంకా రాలేదని ఆయన అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేపట్టలేని స్థాయిలో ఉద్యోగ నియామకాల కార్యక్రమం చేపట్టామని ఆయన చెప్పారు. ఆరోగ్య, వైద్య రంగాల్లో ఎన్నో మార్పులు తెచ్చామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications