శ్రీధర్ క్షేమం కోసమే, ఏమైనా ప్రేమలేఖ పంపారా: కిరణ్
హైదరాబాద్: శ్రీధర్ బాబు క్షేమం కోసమే తాను ఆయన శాఖను మార్చానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజాప్రతినిధులకు చెప్పారు. శ్రీధర్ బాబు శాఖ మార్పు పైన తెలంగాణ ప్రాంత నేతలు అందరూ గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. శుక్రవారం అసెంబ్లీ రేపటికి వాయిదా పడిన తర్వాత తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు ముఖ్యమంత్రిని కలిశారు. శ్రీధర్ శాఖ ఎందుకు మార్చారని నిలదీశారు.
దీంతో శ్రీధర్ బాబు క్షేమం కోసమే తాను శాఖను మార్చాల్సి వచ్చిందని, తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చ జరుగుతున్న సమయంలో అదే ప్రాంతానికి చెందిన వ్యక్తిగా ఆయన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని వివరించారు. శ్రీధర్ బాబు ఏమైనా ప్రేమ లేఖ రాశారా, దానిపై రేపు స్పందిస్తానని మరో సందర్భంలో చెప్పారు.

కాగా, శ్రీధర్ బాబు శాఖ మార్పు దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రి శ్రీధర్ బాబును శాసన సభ వ్యవహారాల నుండి తప్పించి వాణిజ్య పన్నుల శాఖకు మార్చారు. శాసన సభ వ్యవహారాలను సమైక్యాంధ్ర ఉద్యమ మంత్రి శైలజానాథ్‌కు అప్పగించారు.
శ్రీధర్ బాబు శాఖ మార్పుపై తెలంగాణ ప్రాంత నేతలు పార్టీలకతీతంగా మండిపడుతుండగా, సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ నేతలు మాత్రం సమర్థించుకుంటున్నారు. సీమాంధ్ర ఇతర పార్టీల నాయకులు కాంగ్రెసు పార్టీ డ్రామాలో భాగమని విమర్శిస్తున్నారు.












Click it and Unblock the Notifications