సమైక్య ఉద్యమంలోకి కిరణ్ దిగుతారు: లగడపాటి
విజయవాడ: సమైక్య ఉద్యమంలోకి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యక్షంగా దిగుతున్నారని, వచ్చే వారంలో జిల్లాల పర్యటన చేయనున్నారని విజయవాడ పార్లమెంటు లగడపాటి రాజగోపాల్ తెలిపారు. విజయవాడలో కాంగ్రెస్ కార్యకర్తల దీక్షా శిబిరాన్ని శనివారం ఆయన సందర్శించారు. సమైక్య ఉద్యమం సరికొత్త మలుపు తిరగబోతోందని చెప్పారు.
వచ్చే వారంలో ముఖ్యమంత్రి తెలంగాణ సహా ప్రతి జిల్లాలోనూ పర్యటించి సమైక్యంపై ప్రజా చైతన్యం తీసుకు రానున్నారని చెప్పారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇలా ఉద్యమంలోకి రావడం ఇదే మొదటిసారి కాగలదని చెప్పారు. కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడెలా ధర్మంవైపు ఉన్నారో ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కూడా అదే పాత్ర పోషించనున్నారని చెప్పారు.

ఉద్యోగులు సమ్మె విరమించినా గ్రామ గ్రామాన సమైక్య ఉద్యమం నడుస్తూనే ఉందన్నారు. 371 (డి), 371 (ఇ)లు మనకున్నాయని, వీటి ద్వారా సమైక్యం కోసం పోరాడేందుకు అవకాశం ఉందన్నారు. ఆర్టికల్ -3 ద్వారా సింపుల్ మెజారిటీతో విభజన చేస్తామంటే కుదరదని, మొండిగా ముందుకు వెళితే న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి దంపతులు విజయవాడలో జరిపిన సమావేశం యాదృచ్ఛికమేనని, వారు తనతో మాట్లాడారని చెప్పారు.
స్పీకర్‌కు ఇచ్చిన రాజీనామాల్లో కొందరు ఒత్తిడి అన్నారని, మరికొందరు వ్యక్తిగతమని అన్నారని, ఇలా పలు విధాలుగా ఉండడంతో స్పీకర్ వాటిని భావోద్వేగాలతో కూడిన రాజీనామాలుగా భావించి తిరస్కరించి ఉండవచ్చునని అంతకు ముందు మీడియా ప్రతినిధులతో అన్నారు. రాజీనామాలు ఆమోదిస్తే ప్రభుత్వం మైనార్టీలో పడిపోతుందన్న ఉద్దేశం కూడా ఉండవచ్చునని లగడపాటి అన్నారు.












Click it and Unblock the Notifications